తెలంగాణలో షూటింగులకు అడ్డా హైదరాబాద్. ఇక్కడే బోలెడన్ని లొకేషన్లు ఉన్నాయి. స్టూడియోలున్నాయి. నగర శివార్లలోకి వెళ్తే.. సెట్లు వేసుకోవడానికి బోలెడంత జాగా. అందుకే షూటింగులకు హైదరాబాద్ తిరుగులేని అడ్డాగా మారింది. లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని షరతులతో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే షూటింగులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే.. హైదరాబాద్ పరిస్థితి చూస్తే మాత్రం ఇదివరకటిలా స్వేచ్ఛగా షూటింగులు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే… తెలంగాణలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హైదరాబాద్ ఒకటి. సగం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కంటెంన్మెంట్ జోన్లు కూడా హైదరాబాద్‌లో ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
ఇక మీదట హైదరాబాద్ అవుడ్డోర్ షూటింగులు అంతే తేలిక కాదు. ఎక్కడ పడితే అక్కడ షూటింగులూ చేసుకోలేరు. అంతెందుకు తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇచ్చినా, హైదరాబాద్‌లో మాత్రం షూటింగులకు నో చెబితే.. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పైగా పెద్ద హీరోలు సైతం కొంతకాలం పాటు హైదరాబాద్‌లో షూటింగులు వద్దు అని చెబుతున్నార్ట. చేసుకున్నా రెడ్ జోన్‌లకు దూరంగా ఉండాలి. ఆ ప్రాంతం నుంచి వచ్చే.. సిబ్బందిని షూటింగులకు దూరం పెట్టాలి. ఇదంతా పెద్ద తలనొప్పే.