ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలోనూ తడబడింది. తీర్పు వచ్చిన మూడు రోజుల తర్వాత..స్టే కోరుతూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందులో అన్నీ తప్పుల తడకలే ఉన్నాయి. సాధారణంగా ఎస్ఎల్పీ దాఖుల చేసిన వ్యక్తి లేదా.. ప్రభుత్వం వాది అవుతారు. ఎవరికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తున్నారో వారు ప్రతివాది అవుతారు. కానీ ఏపీ సర్కార్ వేసిన పిటిషన్లో వాది.. ప్రతివాది రెండూ ప్రభుత్వమే అని ప్రభుత్వం తరపు లాయర్లు చేర్చారు. దీంతో తప్పులు సరి చేసి మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరో వైపు..ఒక్క ఎస్ఎల్పీ దాఖలు చేస్తే సరిపోదని న్యాయనిపుణులు చెబుతున్నారు. నిమ్మగడ్డతో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కలిపి.. హైకోర్టు విచారణ జరిపి తీర్పు నిచ్చిందని.. అందుకే.. ఒక్కటే ఎస్ఎల్పీ దాఖలు చేస్తే సరిపోదని విశ్లేషణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాదులు మరో మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లను దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు హైకోర్టులో వేసిన స్టే పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. మరో వైపు సుప్రీంకోర్టులోవేసిన ఎస్ఎల్పీ.. తప్పుల కారణంగా విచారణకు రాలేదు. అదే సమయంలో.. రెండు కేవియట్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
ఈ మొత్తం వ్యవహారంలో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న లాయర్లు.. న్యాయనిపుణులు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తూ.. ప్రభుత్వం పరువు తీస్తున్నారన్న అభిప్రాయాలు వైసీపీలోనే వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగలడం ఒకటి అయితే.. . కనీసం పిటిషన్లు కరెక్ట్ గా వేయడం రాకపోవడం ఏమిటన్న ఆశ్చర్యం అధికార పార్టీలో వ్యక్తమవుతోంది.