అమరావతి రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ…ప్రత్యక్ష ఉద్యమాలకు దూరంగా ఉన్న రైతులు.. మధ్యలో భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న ప్రభుత్వ తీరుపై పోరాటం చేశారు. కేసుల్లోనూ ఇరుక్కున్నారు. న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో.. కేంద్రం లాక్డౌన్ను సడలిస్తూ.. అన్లాక్ నిబంధనలు తెస్తూండటం.. ఎనిమిదో తేదీ నుంచి…మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాజకీయ పార్టీల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అమరావతి జేఏసీ నేతలు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను కలిసి ఈనెల 8 నుంచి రెండో విడత ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని .. బీజేపీ తరపున సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే.. జూన్ నెలాఖరు వరకు.. లాక్ డౌన్ అమలులో ఉన్నందున.. జులై 1 నుంచి ప్రారంభించాలని .. బీజేపీ తరపున సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కన్నా లక్ష్మినారాయణ హామీ ఇచ్చారు. మిగతా పార్టీల మద్దతును కూడా… అమరావతి రైతులు కోరే అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ ను అడ్డం పెట్టుకుని ఏపీ సర్కార్.. భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి మార్కింగ్ కూడా చేసిందని…రైతులు అంటున్నారు.
కోర్టులను సైతం పట్టించుకోకుండా.. ముందుకెళ్తోందని..తాము అవకాశం వచ్చిన తర్వాత ఉద్యమం ప్రారంభించకపోతే.. ప్రభుత్వం తాము రాజధాని కోసం ఇచ్చిన భూములను పంచేస్తుందని.. వారు భావిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా.. తమ ఉద్యమాన్ని మరింతగా ఉద్ధృతం చేయాలని భావిస్తున్నారు. ఈ సారి రాజకీయ పార్టీలు అదే ఉత్సాహంతో మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తాయో లేదో చూడాలి..!