‘అంతా తమ మీదే ఆధారపడి నడుస్తున్నదంటే.. తమకు నచ్చినట్టు ఆడించాలని చూస్తారు. తమ పాత్ర నిమిత్తం అనే క్లారిటీ ఏర్పడిందంటే మాత్రం అణిగి మణిగి ఉంటూ.. తమ తమ సొంత పనులు చక్కబెట్టుకోవడం మీద దృష్టిపెడతారు’ సహజంగానే మానవ నైజం ఇది. ప్రస్తుత రాజకీయాల్లో హైదరాబాదు నగరంలో ప్రతిసారీ తమ ఇష్టానుసారం చెలరేగిపోతూ ఉండే మజ్లిస్ పార్టీ వైఖరిలో ఈ సిద్ధాంతం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ హయాంలో అధికార పార్టీని బెదిరించి పనులు చేయించుకున్న తరహాలో ఇప్పుడు వారు దూకుడుగా వ్యవహరించేలా కనిపించడం లేదు. తమకు బలం ఉన్నప్పటికీ.. తమకున్నది ఎవ్వరికీ అనవసరం అయిన బలం గనుక.. వీలైనంత మంచిగా ఉంటూ.. సానుకూలంగా ఉంటూనే మనుగడ సాగించాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
గత కొన్ని వారాల్లోనే మారుతూ వచ్చిన మజ్లిస్ వైఖరి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మజ్లిస్ తమకు మిత్రపక్షమే అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభాముఖంగా ప్రకటించారే తప్ప.. మజ్లిస్ పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూ తెరాస తమకు మిత్రపక్షం అనే మాటను తమ నోటితో గ్రేటర్ ఎన్నికలకు ముందు ఒక్కసారి కూడా చెప్పలేదు. గులాబీ పార్టీ ఉన్న చోట్లల్లా తమ పార్టీ వారిని కూడా బరిలో నిలిపారు. పైగా పోలింగ్ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి ఇల్లు, ఆఫీసు మీద దాడిచేసి ఆయన కొడుకును చితక్కొట్టారు. ఇలా తమ ఇచ్ఛానుసారంగా వ్యవహరించారు.
అయితే రిజల్ట్ తర్వాత పరిస్థితి మారింది. గ్రేటర్ మేయర్ ఎన్నిక జరిగిన గురువారం రోజున తెరాస ప్రతిపాదించిన బొంతు రామ్మోహన్, ఫసియుద్దీన్ల ఎన్నికకు మజ్లిస్ పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. నిజానికి మజ్లిస్ మద్దతు తెలియజేయాల్సిన అవసరం లేదు. తెరాసకు పూర్తి బలం ఉంది. కానీ.. అధికార పార్టీతో సత్సంబంధాలు కోరుకుంటూ.. తమకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి మద్దతు ఇస్తూ.. తము మిత్రులమే అనే సంకేతాలు ఇవ్వడానికి మజ్లిస్ ప్రయత్నించింది అనుకోవాలి.
ఇదే కాంగ్రెస్ హయాంలో పరిస్థితి మరో రకంగా ఉండేది. అప్పట్లో కాంగ్రెస్కు వచ్చింది 52 సీట్లే. తమ బలం మీదనే కాంగ్రెస్ మేయర్ గద్దె ఎక్కినందున.. మజ్లిస్ వారిని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని బెదిరించి పనులు చేయించుకునేదని అందరూ అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ను బెదిరించినట్లుగా బెదిరింపులు ఇప్పుడు నడవ్వు అని, తెరాసతో మంచిగా ఉంటే తప్ప మనుగడ ఉండదని మజ్లిస్ భావిస్తున్నట్లుగా మేయర్ పోలింగ్ సందర్భంగా వ్యవహార సరళి తెలియజేస్తున్నది.