కేంద్ర ప్రభుత్వం తీసుకు రాదల్చిన కొత్త విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై పూర్తి స్థాయిలో అధికారం తమకు దఖలు పర్చుకునేందుకు కేంద్రం ఈ కొత్త చట్టం చేస్తోందని కేసీఆర్ నమ్ముతున్నారు. విద్యుత్ వ్యవస్థ రాష్ట్రాల చేతుల నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్తే… ఆర్థికంగా బలహీనపడతాయని.. అది చాలా ప్రమాదకరమని కేసీఆర్ వాదిస్తున్నారు. విద్యుత్ వ్యవస్థను పూర్తిగా కేంద్రం తన అధీనంలోకి తీసుకోవడం .. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేసీఆర్ గట్టిగా వాదిస్తున్నారు.
కేంద్రం తీసుకు రాదల్చిన కొత్త చట్టం డ్రాఫ్ట్ పై .. రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ తన తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తూ… అభ్యంతరాలను కూడా ప్రస్తావిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. ప్రతిపాదిత కేంద్ర విద్యుత్ చట్టంలోని అంశాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రాయితీలు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఏమైనా ఇవ్వాలంటే… నేరుగా నగదు రూపంలో విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులకు కారణం అవుతాయని.. కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. ప్రతిపాదిత విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.
దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. వారెవరూ.. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని భావిస్తున్న తమిళనాడు పాలక పార్టీ అన్నాడీఎంకే కూడా.. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది. ఇక మమతా బెనర్జీ లాంటి వారు.. అసలు సమర్థించే అవకాశమే లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ చట్టాన్ని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా చెబుతూ.. కొత్త రాజకీయ వేదిక కోసం పునాదుల కోసం ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా ఈ కారణంగానే జరుగుతోంది. విద్యుత్ చట్టంపై వ్యతిరేకత పోరాటంలో అందర్నీ ఏకం చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ఇప్పటిది కాదు. గత ఎన్నికలకు ముందు టేకాఫ్ కాలేకపోయారు. ఈ సారి మాత్రం.. బలమైన ప్రాతిపదిక ఉంటుందని నమ్ముతున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా.. కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పి.. పోరాటం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే.. కేసీఆర్కు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు లభిస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది. నిజానికి కేంద్రం ఇలాంటి చట్టం తీసుకు రావడం వెనుక.. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రధాన పాత్ర పోషించాయని చెబుతూ ఉంటారు. అయితే.. ఇప్పటి వరకూ ఏపీ .. కేంద్రం తీసుకురాదల్చిన చట్టంపై పూర్తి స్థాయి వ్యతిరేకత ఎప్పుడూ చూపించలేదు. రాష్ట్రాల అధికారాలు తగ్గిపోతాయని కేసీయార్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నా.. ఏపీ వైపు నుంచి మద్దతు రాలేదు. జగన్ మద్దతు కూడా కేసీఆర్ పొందితే బలం పెరిగినట్లవుతుంది.