నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ సుధాకర్ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఫిర్యాదులు రావడం… ప్రభుత్వం ఇచ్చిన నివేదికకు.. సెషల్ జడ్జి ఇచ్చిన నివేదికకు మార్పులు ఉండటంతో.. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ గుర్తు తెలియని పోలీసులు.. అధికారులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నాలుగైదు రోజుల్నుంచి.. అన్ని కోణాల్లోనూ .. సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. మాస్కులు లేవని.. మీడియా ముందు సుధాకర్ అసంతృప్తి వ్యక్తం చేసిన దగ్గర్నుంచి అసలేం జరిగిందన్నదానిపై కూపీ లాగుతున్నారు. సుధాకర్ ఫోన్ కాల్స్.. ఆయనకు వచ్చిన వేధింపులు.. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వేధింపులు సహా… సుధాకర్ చెబుతున్న అంశాలన్నింటిపైనా ఆధారాలు సేకరిస్తున్నారు. జాతీయ రహదారిపై సీసీ టీవీ ఫుటేజీని కూడా సేకరించారు. సుధాకర్‌కు అంత వేగంగా.. మానసిక వ్యాధి ఉందని నిర్ధారించడానికి గల ప్రాతిపదికను కూడా.. సీబీఐ అధికారులు తెలుసుకున్నారు. రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు.
హైకోర్టు ఎనిమిది వారాల్లో నివేదిక అందించమని సీబీఐని ఆదేశించింది. వ్యవధి తక్కువగా ఉండటంతో.. అన్ని రకాలుగా..సీబీఐ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. సుధాకర్ తల్లి, కుమారుడిని కూడా ప్రశ్నించారు. అయితే.. ఈ క్రమంలో.. సుధాకర్ పై కూడాకేసు పెట్టడం… హైలెట్ అవుతోంది. న్యూసెన్స్ చేసినందుకు పోలీసులు ఇప్పటికే ఆయనపై కేసు పెట్టారు. ఆ కేసులు ఉండగానే..అదే ఆరోపణలతో సీబీఐ కూడా కేసు నమోదు చేయడం ఏమిటన్న చర్చ జరుగుతోంది. అసలు సీబీఐ కేసు పెట్టడానికి కారణం ఏమిటన్నదానిపై.. క్లారిటీ రావాల్సి ఉంది.