ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒకొక్కరు… రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ కలెక్టర్ సహా మరో ఇద్దరితో పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళికా కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. రెండు నెలల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని .. కేంద్ర పర్యావరణశాఖ ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. అదే సమయంలో.. పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించడానికి మరో కమిటీని నియమించాలని ఎన్జీటీ ఆదేశించింది. రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విషయంలో ఓ ప్రత్యేక కమిటీని నియమించి విచారణ జరిపించిన ఎన్జీటీ.. తీర్పులో కీలక నిర్ణయాలు ప్రకటించింది. అనుమతులు లేకుండా సంస్థ నడవడం ద్వారా… చట్టాలు వైఫల్యం చెందడానికి కారణమైన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. తీసుకున్న చర్యలతో రెండు నెలల్లో ఎన్జీటీకి నివేదిక సమర్పించాలని.. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా కంపెనీ తిరిగి ప్రారంభించొద్దని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన అనుమతులు వచ్చాక ఎన్జీటీయే అనుమతి ఇస్తుందని అప్పటి వరకూ తెరవవొద్దని ఆదేశించింది. సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం ఎన్జీటీకి ఉందని .. పర్యావరణానికి హాని కలిగి చర్యలు జరిగినప్పుడు… ఎన్జీటీ చేతులు కట్టుకొని కూర్చోదని ట్రిబ్యూనల్స్పష్టం చేసింది. హైకోర్టు, ఇతర ఫోరాలు వేసిన కమిటీలు వాటి విచారణలు అవిచేస్తాయని…సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఎన్జీటీ తీర్పులను ఇస్తుందని ధర్మాసనం స్ఫష్టం చేసింది.
ఎన్జీటీ తీర్పుతో… ఎల్జీ పాలిమర్స్ సంస్థ..ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడం సాధ్యం కాదని తేలిపోయింది. స్టైరిన్ లేని ఉత్పత్తుల ప్రారంభానికి సంస్థ ప్రయత్నిస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. తాము అనుమతి ఇచ్చే వరకూ.. ప్రారంభించవద్దని స్పష్టం చేయడంతో..ఎల్జీ పాలిమర్స్‌కు షాక్ తగిలినట్లయింది. అయితే.. ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్జీటీతోనే కాదు.. ముందు ముందు చట్టబద్ధ సంస్థల నుంచి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.