కార్య నిర్వాహక వ్యవస్థ ఇచ్చే ఉత్తర్వులను న్యాయ వ్యవస్థ సమీక్ష చేయవచ్చునని… సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులే ఫైనల్ అని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై వెలువరించిన తీర్పులో.. సుప్రీంకోర్టు ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ తీర్పులను ఎవరైనా పాటించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. న్యాయవ్యవస్థ తీర్పులను పాటించకపోతే చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని… కోర్టు ఆదేశాలు పాటించకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలను.. ఏపీ సర్కార్ దాఖలు చేసిన రంగుల జీవోపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై ఇచ్చిన జడ్జిమెంట్‌లో చేసింది. పంచాయతీ భవనాలకు రంగులను తొలగించాల్సిందేనని .. హైకోర్టు ఆదేశాల్లో ఎటువంటి తప్పు లేదు, తీర్పును క్షుణ్ణంగా పరిశీలించామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని .. రాజకీయ పార్టీలకు చెందిన ఏ రంగునూ ప్రభుత్వ భవనాలపై ఉపయోగించరాదని.. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో విస్పష్టంగా పేర్కొంది. రంగుల జీవో విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు బెంచ్‌మార్క్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో… కోర్టు తీర్పులను విమర్శిస్తున్న కొంత మంది నేతలు… పాలనలో న్యాయవ్యవస్థ జోక్యం అంటూ ఆరోపణలు చేశారు. కోర్టులు సమాంతర పాలన నడుపుతున్నాయని.. కొంత మంది అంటున్నారు. ఇది వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీస్తుందని కూడా విశ్లేషించారు. అయితే.. సుప్రీం కోర్టు.. కార్యనిర్వాహక వ్యవస్థ ఇచ్చే ఉత్తర్వులను సమీక్షించే అధికారం…న్యాయవ్యవస్థకు ఉందని..స్పష్టమైన రూలింగ్ ఇచ్చేసింది. తమకు ప్రజలు అధికారం కట్టబెట్టారని.. చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ఏదైనా చేయవచ్చని భావిస్తున్న వారికి..సుప్రీంకోర్టు రూలింగ్.. వాస్తవ పరిస్థితిని తెలియచేస్తుందన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఏర్పడింది.