ఏ రాష్ట్రంలో అయినా పోలీసు, ఎక్సైజ్ డిపార్టుమెంట్లు ఉంటాయి. అవి చట్ట నిర్ణయాల ద్వారా ఏర్పడ్డాయి. వాటికి ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి. ఆ డిపార్టుమెంట్లు పెట్టే కేసులను… వాటిని ఏర్పాటు చేసిన చట్టాల ప్రకారం పెడతారు. విచారణ..శిక్షలు కూడా వేస్తారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఏపీలో కొత్తగా.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో.. ఎస్ఈబీ అనే దాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు. దీని కోసం జీవో 41ను విడుదల చేశారు. ఆ తర్వాత ఎక్సైజ్‌లో ఉన్న వారిలో 70 శాతం మందిని ఆ శాఖకు బదిలీ చేశారు. అయితే.. ఇప్పుడు అందరికీ ఓ అనుమానం వచ్చింది. ఎస్ఈబీ పెట్టే కేసులు ఏ చట్టం ప్రకారం పెడతారు.. అనేదే.
అక్రమ మద్యం, ఇసుక అక్రమాల నివారణ లక్ష్యంగా ఎస్ఈబీని ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున మద్యం రవాణను కేసుల్ని నమోదు చేస్తున్నారు. ఈ సమయంలో.. అసలు ఎస్ఈబీ అనేదే చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975, ఏపీ ఎక్సైజ్ చట్టం 1968, రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2018కి విరుద్ధంగా ఎస్ఈబీని ఏర్పాటు చేశారని.. పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్ఈబీకి న్యాయబద్ధ అనుమతి లేదని, అలాంటప్పుడు వారు నమోదు చేసిన కేసులు న్యాయపరీక్షకు నిలబడవని ఆయన అంటున్నారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏ నిబంధనల ప్రకారం ఎస్ఈబీని ఏర్పాటు చేశారో చెప్పాలని.. ఆరుగురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సీఎస్, స్పెషల్ సీఎస్, డీజీపీ సహా మరో ముగ్గురికి నోటీసులు వెళ్లాయి. తదుపరి విచారణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం చట్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా పాలన చేస్తోందని వస్తున్న విమర్శల నేపధ్యంలో… ఈ ఎస్ఈబీ ఏర్పాటు కూడా.. న్యాయపరీక్షకు వెళ్లింది. ఏ చట్టం ప్రకారం.. ఎస్ఈబీని ఏర్పాటు చేశారో.. అధికారులు హైకోర్టుకు చెప్పలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.