తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో, చిరంజీవి ఆధ్వర్యంలో భేటీ అయిన సినీ పరిశ్రమ పెద్దల ని ఉద్దేశించి ” భూములు పంచుకుంటున్నారా” అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు సినీ పరిశ్రమ కోసం బాలకృష్ణ ఎప్పుడు ముందుంటారని నిర్మాత అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ తో గతంలో చిత్రాలు నిర్మించిన అంబికాకృష్ణ మాట్లాడుతూ, వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తనకు 20 ఎకరాలు కేటాయించాల్సిందిగా బాలకృష్ణ ప్రభుత్వాన్ని గతంలో కోరారని అంబికా కృష్ణ అన్నారు. వివరాల్లోకి వెళితే..
అంబికా కృష్ణ మాట్లాడుతూ, వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అప్పట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ పరిశ్రమకు కేటాయించాలని నిర్ణయించుకున్నారని, అప్పుడు ఆ స్థలాన్ని తాను వెళ్లి పరిశీలించానని అది సినీ పరిశ్రమకు అనువైనదిగా ఉందని భావించానని అంబికా కృష్ణ అన్నారు. అప్పుడు ఆ మూడు వందల ఎకరాల లో 20 ఎకరాల భూమిని తమకు కేటాయించాల్సిందిగా బాలకృష్ణ సైతం అప్లై చేశారని, అలాగే మరొక 20 ఎకరాలు కావాలని ఏవీఎం సంస్థవారు కోరారని, తాను కూడా ఒక మూడు ఎకరాల స్థలం కావాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని కోరానని అంబికా కృష్ణ అన్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆ ప్రభుత్వం మారి పోవడం, తెలుగు రాష్ట్రాలలో రకరకాల సమస్యలు రావడం వంటి వాటి కారణంగా ఆ ప్రపోజల్ మరుగున పడిపోయింది అని అంబికా కృష్ణ అన్నారు. అందరూ తెలంగాణ లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని , కానీ అప్పట్లోనే బాలకృష్ణ ఆంధ్ర లొ సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని కోరుకున్నారని అంబికా కృష్ణ అన్నారు.
అయితే అంబికా కృష్ణ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం వైజాగ్లో స్థలం తీసుకుని పరిశ్రమను అభివృద్ధి చేయాలని బాలకృష్ణ అనుకోవడం మంచిదే అని కొందరు అంటే, ప్రభుత్వాన్ని భూములు అడిగిన చరిత్ర కలిగిన బాలకృష్ణ- మిగతా సినీ పెద్దలను మాత్రం భూములు పంచుకుంటున్నారా అని ఎలా విమర్శిస్తారు అని మరికొందరు అంటున్నారు. అదే విధంగా ఇటీవల బాలకృష్ణ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఒక మూడు ఎకరాలు అడిగితే కేటాయించదెందుకు అని ప్రశ్నించిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, తెలంగాణలో సైతం బాలకృష్ణ కేసీఆర్ ప్రభుత్వాన్ని భూములు అడిగారని, కెసిఆర్ నుండి దానికి సానుకూల స్పందన రాకపోవడంతో మిగిలిన సినీ పెద్దలు కేసీఆర్ తో భేటీ కావడం పై ఆయన విమర్శలు చేస్తున్నారని ఇంకొందరు అంటున్నారు.
మొత్తానికి బాలకృష్ణ చేసిన భూముల పంపకం వ్యాఖ్యల మంటలు ఇప్పటికీ చల్లారడం లేదు.