వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలుచేసింది. ఇంగ్లీష్ మీడియాన్ని నిర్బంధం చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవోలు 81, 85లను జారీ చేసింది. విచారణ తర్వాత వాటిని హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తున్నామన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సవాల్ పిటిషన్లో పేర్కొంది. 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకుంటున్నారని .. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
హైకోర్టులో జీవోలు కొట్టి వేసిన తర్వాత తల్లిదండ్రుల వద్ద నుంచి వాలంటీర్ల ద్వారా అఫిడవిట్లు సేకరించింది ఏపీ సర్కార్. వాటిని సుప్రీంకోర్టులో వాదనలకు ఉపయోగించుకోనుంది. రాజ్యాంగం ప్రకారం..విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఏ మీడియంలో చదవాలన్నది..తల్లిదండ్రులు.. విద్యార్థుల ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫలానా మీడియంలో చదవాలనే నిర్బంధం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. స్కూళ్లలో రెండు మీడియంలు అందుబాటులో ఉంటే.. పిల్లలు వారు చదవాలనుకున్న మీడియంలో చదువుతారు. కానీ ప్రభుత్వం అసలు తెలుగు మీడియం ఉంచబోమని చెబుతూండటంతో వివాదం తలెత్తుతోంది. పైగా.. తెలుగు మీడియంను కూడా ఉంచాలని డిమాండ్ చేసిన వారిపై .. పేదలకు ఇంగ్లిష్ మీడియం వద్దా అని ఎదురు దాడి చేస్తోంది.
హైకోర్టు తీర్పు తర్వాత ఎంపీ నందిగం సురేష్..తీర్పు ఇచ్చిన వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారన్న వ్యాఖ్యలు కూడా చేశారు. రెండు మీడియంలు విద్యార్థులకు అందుబాటులో ఉంచితే సమసిపోయే సమస్యను..సుప్రీంకోర్టు వరకూ ప్రభుత్వం తీసుకెళ్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.