టీవీ5 జర్నలిస్టు మూర్తి గత వారం కొన్ని రోజుల పాటు స్క్రీన్ మీదకు రాలేదు. కారణమేంటా అని చాలా అనేక రకాలుగా అనుకున్నారు. అయితే హఠాత్తుగా ఆయన గురువారం స్క్రీన్ మీదకు వచ్చి .. ఎందుకు కనిపించకుండా పోవాల్సి వచ్చిందో చెప్పారు. ఆ కారణం… ఏపీ సర్కార్ పెట్టిన కేసులు. ఆ కేసుల్లో న్యాయపోరాటం చేసి.. బెయిల్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు మూర్తి. ఆయన మాత్రమే కాదు.. టీవీ5 చైర్మన్ కూడా.. ఈ కేసుల్లో ఉన్నారు. ఆయనకు కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రముఖ జర్నలిస్టు జంధ్యాల రవిశంకర్ ఈ విషయంలో వారి తరపున హైకోర్టులో పోరాడారు.
టీవీ5 చైర్మన్, జర్నలిస్టు మూర్తిపై ఉన్న కేసు ఏమిటంటే… ప్రభుత్వ విభాగానికి చెందిన నోట్పైల్ను దొంగిలించడం. కాస్త అతిశయంగా ఉన్నా.. ఇదే కేసు. కొన్నాళ్ల కిందట.. కరోనా హడావుడి ప్రారంభమవుతున్న సమయంలో యూనివర్శిటీల పాలక మండళ్లను ప్రభుత్వం నియమించింది. రాజకీయనేతల సిఫార్సుల మేరకు.. వారిని నియమించారని… వెలుగు చూసింది. ఎవరెవరర్ని.. ఏ ఏ నేత సిఫార్సు మేరకు నియమించారో చెబుతూ.. ఓ నోట్ ఫైల్ .. శ్రవణ్ కుమార్ అనే న్యాయవాదికి చేరింది. అది అన్ని మీడియాల్లోనూ వచ్చింది. టీవీ5లో మూర్తి షోలో లాయర్ శ్రవణ్ కుమార్ దాన్ని ప్రదర్శించి.. ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను రాజకీయం చేస్తోందని.. రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేస్తోందని మండిపడ్డారు. ఆ తర్వాత అన్ని మీడియాల్లో ఆ వార్త వచ్చింది. దానికి వివరణగా సజ్జల రామకృష్ణారెడ్డి.. గతంలో టీడీపీ అలా నియమించలేదా అనే వాదన కూడా వినిపించారు. అంతటితో ఆ వివాదం పాతబడిపోయింది.
కానీ.. ఆ నోట్ ఫైల్ బయటకు ఎలా వచ్చిందన్నదానిపై యూనివర్శిటీలను చూసే.. ప్రభుత్వ విభాగ ఉన్నతాధికారి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం చేసి ఉండవచ్చు లేదా.. ఫోర్జరీ చేసి ఉండవచ్చు అని ఫిర్యాదు చేశారు. ప్రశ్నిస్తేనే సీఐడీ అధికారులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్న రోజులు.. ఇక టీవీ5పై ప్రత్యేకంగా టార్గెట్ చేసి పెడితే ఊరుకుంటారా..?. తర్వాత కోర్టుల్లో జరిగేది జరుగుతుందని… శ్రవణ్ కుమార్.. టీవీ5 మూర్తి, టీవీ చైర్మన్ కోసం వేట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. దాంతో వారు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఏపీ సర్కార్ టార్గెట్ చేస్తే మీడియా అయినా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుందో.. ప్రస్తుతం టీవీ5 ఎదుర్కొంటున్న పరిస్థితులే సాక్ష్యం.