తెలంగాణతో ఉన్న సన్నిహిత సంబంధాలతో.. స్మూత్‌గా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాల్సిన ఏపీ ప్రభుత్వం… అనవసర వివాదంతో.. కేఆర్ఎంబీ దృష్టిలో పడేలా చేసుకుంది. ఫలితంగా.. ఇప్పుడు.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉంటే తప్ప.. నిర్మించడానికి వీల్లేదని.. కృష్ణా రివర్ బోర్డు స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. దీంతో.. జీవో దాకా వచ్చిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు.. టెండర్ల వరకూ వెళ్లడం కష్టంగా మారింది. రాయలసీమకు నీరు అందించే ఈ ప్రాజెక్టు… వివాదాల్లో చిక్కుకుపోయింది. ఓ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే ఇలా వివాదాల్లోకి వెళ్తే.. మళ్లీ ప్రారంభమవడం అంత తేలికైన విషయం కాదని.. చరిత్రలో ఆగిపోయిన అనేక ప్రాజెక్టుల శిలాఫలాకాలు గుర్తు చేస్తున్నాయి.
ఆంధ్రకు కేటాయించిన నీళ్లను ఎత్తిపోసుకోవడానికి మాత్రమే… సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం నిర్మించతలపెట్టింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని… తమకు కేటాయించిన నీటిని మాత్రమే తోడుకుంటామని చెబుతున్నారు. అయితే.. ఆయన ఈ విషయాన్ని చెప్పాల్సిన చోట చెప్పలేదు. ఏడాది సమీక్షల్లో చెప్పారు కానీ.. అసలు చెప్పాల్సింది తెలంగాణం సీఎంతో. ఆయనతో మంచి సబంధాలున్న కారణంగా.. ఆయనతో చెప్పి ఉంటే.. తెలంగాణ అధికారులు… కేఆర్ఎంబీకి ఎత్తిపోతలపై ఫిర్యాదు చేసేవారే కాదు. ఫిర్యాదు రానప్పుడు.. ఎత్తిపోతల గురించి అసలు కేఆర్ఎంబీ పట్టించుకునేదే కాదు.
రాయలసీమకు నీరు అందించే ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయడం వల్ల కొత్తగా ఏపీ సర్కార్ కు ఒరిగేదేమీ లేదు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం చివరి దశలో ఉంది. కాళేశ్వరంకు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోత్సవం చేసి వచ్చారు కూడా. కానీ ఇంకా టెండర్ల దశకే రాని .. రాయలసీమ ఎత్తిపోతల పథకం.. మాత్రం రిస్క్‌లో పడిపోయింది. ప్రభుత్వం తెలివిగా వ్యవహరించి.. తెలంగాణతో ఫిర్యాదుల వరకూ వెళ్లకుండా.. సామరస్యంగా డీల్ చేసుకుని ఉంటే.. ప్రాజెక్ట్ కల చాలా వేగంగా సాకారమయ్యేదని అంటున్నారు. ఇప్పుడు.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జరగడం ప్రభుత్వ వ్యూహంలో లోపమేనంటున్నారు.