”కాంగ్రెస్ ఏలుబడిలో పదేళ్లపాటూ మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం.. ఎప్పటికైనా మళ్లీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకంతోనే బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పదేళ్లు రాజకీయాలు చేశాం. కానీ ఇప్పటికీ పార్టీ గద్దె మీదికి రాలేదు. ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునేలా కూడా లేదు. ఇంకా ఎంతకాలం ఈ పార్టీలో ఉండగలం. రాజకీయాల్లో ఖర్చులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. వ్యాపారాల్లో సంపాదించుకుంటూ.. ఇక్కడ పార్టీకోసం తగలేస్తూ ఎంతకాలం బతగ్గలం.. భవిష్యత్తు బాగుండాలంటే.. మీరు కూడా గులాబీ పార్టీలోకి వచ్చేయండి… అందరం కలిసి.. బాగుపడదాం..” ఇంచుమించుగా ఇదే స్క్రిప్టు ఇప్పుడు తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ ప్రేరేపించడానికి ఉపయోగపడుతోంది.
ఎమ్మెల్యే స్థాయి నాయకులను ఆకర్షించి.. రెండు వంతుల మందిని చేర్చేసుకుని… తెదేపా ఖాళీ అయిపోయింది అనే భావనను రాష్ట్ర వ్యాప్తంగా కలిగించడంలో తెరాస నూరుశాతం సక్సెస్ సాధించినట్లే లెక్క. అయితే ఒక్కొక్క ఎమ్మెల్యే వెళుతూ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ‘తెలుగుదేశానికి కార్యకర్తలే బలం’ అని ఆ పార్టీ చెప్పుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు సారథ్యంలో ఆ బలం మీద కూడా దెబ్బకొట్టడానికి తెరాస సిద్ధమవుతున్నది.
ఎర్రబెల్లి తాను పార్టీలో చేరినప్పుడు మీడియాలో మాట్లాడుతూ.. తెదేపాను వీడడానికి చాలా బాధగా ఉన్నదంటూనే.. ఆ పార్టీ ఇక బతికే అవకాశం లేదని తేల్చేశారు. పార్టీలోని ”తమ్ముళ్లందరికీ విజ్ఞప్తిచేస్తూ ఉన్నా.. మీరందరూ ఆలోచించండి.. తెలుగుదేశం ఇక లేవదీ.. మీరంతా కూడా తెరాసలోకి వచ్చేయండి.. అభివృద్ధి ఇక్కడ సాధ్యమవుతుంది” అంటూ ఆయన బహిరంగంగా ఒక అప్పీల్ కూడా చేశారు. అదే పని ఇప్పుడు కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ముఖ్యులందరికీ వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ తెరాసలో చేరిపోవడానికి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తున్నది. తెదేపాలో ఉన్నంత కాలం మనం కూడా మరింత ఆర్థికంగా చితికిపోవడం తప్ప ఎదగడం ఉండదు. అందుకే పార్టీలోకి వచ్చేయండి.. అంటూ ఎర్రబెల్లి చెబుతున్నట్లు సమాచారం. తాను పార్టీలో కండువా కప్పుకుని చేరే బహిరంగ సభలోగా.. వీలైనంత ఎక్కువ మందిని పార్టీలోకి తీసుకువెళ్లాలని ఎర్రబెల్లి అనుకుంటున్నట్లు సమాచారం.