కరోనా కారణంగా ఫేస్ మాస్క్ అందరికీ తప్పనిసరి అయింది. దాన్నే డ్రగ్స్ రవాణాకు ఉపయోగిచుకున్నారు.. కొంత మంది హైదరాబాద్ డ్రగ్స్ స్పెషలిస్టులు. ఇప్పుడు వారు పట్టుబడ్డారు. ఓ నైజీరియన్ పట్టుబడటంతో తీగ మొత్తం లాగుతున్నారు. సహజంగా డ్రగ్స్ అనే పేరు బయటకు రాగానే చాలా మందికి టాలీవుడ్ మనసులో మెదుల్తుంది. గత ట్రాక్ రికార్డు అలా ఉంది మరి. ఈ సారి కూడా.. ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. బెంగళూరులో ఓ నైజీరియన్ నుంచి 70 గ్రాముల కొకైన్‌ను… హైదరాబాద్‌కు చెందిన పరంజ్యోతి సింగ్, అమిత్ కుమార్ కొనుగోలు చేశారు. రీసేల్‌లో భాగంగా ఒక గ్రాము కొకైన్‌ను 7 వేల రూపాయలకు అమ్ముతూ దొరికిపోయారు. దొరికిన ముఠా నుంచి ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారో లెక్క తీస్తున్నారు. వారి కాల్ డేటా, వాట్సప్ చాట్లను పరీశిలించి వివరాలు సేకరిస్తున్నారు.
ఎప్పుడు డ్రగ్స్ బయటపడినా.. . మిగతా వారి సంగతేమో కానీ.. వారిలో టాలీవుడ్ ప్రముఖులు ఎవరున్నారనే ఆసక్తి సామాన్యుల్లో ఏర్పడుతుంది. దానికి తగ్గట్లుగా మీడియా కూడా అతి ప్రారంభిస్తుంది. ఒక్కరి పేర్లను కూడా నేరు చెప్పరు కానీ.. ఆ హీరో.. ఈ దర్శకుడు.. ఈ నిర్మాత అంటూ… ప్రచారం ప్రారంభించేస్తారు. ఫలితం.. క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోతుంది. పోలీసులు నిజంగానే మీడియా ప్రతినిధులకు ఆ టైప్ లీకులు ఇస్తారో.. లేక.. వాళ్లే కల్పించుకుంటారో కానీ… ప్రస్తుతం బయటపడిన డ్రగ్స్ కేసులోనూ అలాంటి ప్రచారం ప్రారంభించేశారు.
గతంలో రవితేజ సోదరుడు.. రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తర్వాత దొరికిన ఫోన్ ఆదారంగా తీగ లాగితే చాలా పెద్ద డొంక కదిలింది. చాలా మంది సినీ ప్రముఖుల్ని విచారించారు. అంగీకరించిన వాళ్లందరి దగ్గర రక్త నమూనాలు తీసుకున్నారు. అయితే.. ఆ కేసు ఏమయిందో ఎవరికీ తెలియదు. ఇట్టే పట్టేశామని పోలీసులు కూడా.. మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ దాని వల్ల టాలీవుడ్ ఇమేజ్‌కు మరక పడింది. అప్పుడప్పుడూ… ఈ కేసు బయటకు వస్తూ ఉంటుంది. వాళ్లకీ.. వీళ్లకీ నోటీసులు అని చెబుతూ ఉంటారు. కానీ ఇంత వరకూ ఎలాంటి కదలిక లేదు. సిట్ కూడా..సైలెంట్ అయిపోయిది. ఇప్పుడు బయటపడిన డ్రగ్ రాకెట్ అంత కంటే హడావుడి చేసేదేమీ ఉండదు. అందులో బడాబాబులు ఎప్పటికీ బయటకు రారని.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు..!