పాత నీరెప్పుడూ.. కొత్తనీటికి దారి వదలాల్సింది. అది ప్రవాహ సూత్రం. తరాలతో పాటు అభిరుచులూ మారతాయి. వాటిని పసిగట్టి – దానికి తగ్గట్టు నడుచుకోవాల్సిందే. సినిమా వాళ్లకు అర్థం కావాల్సిన, అర్థం చేసుకోవాల్సిన ప్రాధమిక విద్య ఇది. ఇక్కడా నవతరం వాళ్లకే పెద్ద పీట. స్పీడ్ యుగాన్ని, అందులో పడి బతికేస్తున్న ప్రేక్షకుల అభిరుచుల్ని ఒడిసి పట్టేది వాళ్లే కాబట్టి – పెద్దతరం దర్శకులు పక్కకెళ్లిపోతే, నవతరం ఆ బాధ్యతని భుజాన వేసుకుని ముందుకు నడిపిస్తుంటుంది. కాకపోతే కొంతమంది వెటరన్లు సినిమాపై మమకారం చావకో, ఈతరాన్ని మెప్పించగలం అన్న నమ్మకంతోనో.. అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. ఈసారి వాళ్ల సంఖ్య కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది.
ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సుదీర్ఘ విరామం తరవాత మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. బెంగళూరు నాగరత్నమ్మ కథని వెండి తెరపై చూపించబోతున్నారు. ఆ పాత్రలో ఓ అగ్ర కథానాయిక కనిపిస్తారని టాక్. ఆదిత్య 369, పుష్షక విమానం, విచిత్ర సోదరులు.. ఇలా వైవిధ్యమైన సినిమాల్ని అందించారు సింగీతం. ఆయన ఆలోచనలు, ఊహ అంతా అప్డేటెడ్గా ఉంటాయి. పాతికేళ్ల ముందుకెళ్లి ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈ వయసులోనూ ఆయన ఓ మంచి సినిమా తీయగలరన్న నమ్మకం.. ఆయన అభిమానులందరికీ ఉంది. మరి ఈసారి ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తారో..?
కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఒకప్పుడు ఈవీవీ – ఎస్వీకే పోటీ పడి మరీ సినిమాలు తీసేవారు. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్లో దర్శకుడిగా దాదాపుగా అన్నీ హిట్సే. యమలీల అయితే ఓ మైల్ స్టోన్. సుదీర్ఘ విరామం తరవాత.. ఎస్వీ నుంచి మరో సినిమా రాబోతోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. కె.రాఘవేంద్రరావు ఆఖరి చిత్రం (ఇప్పటి వరకూ) `ఓం నమో వేంకటేశాయ`. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఓ పరాజయంతో తన కెరీర్‌ని ముగించడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే… ఓ హిట్టు కొట్టి సెండాఫ్ తీసుకుందామనుకుంటున్నారు. అందుకు తగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. `పెళ్లి సందడి` టైపులో ఓ చిన్న సినిమాని, గుర్తిండిపోయేలా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. బి. గోపాల్, శివ నాగేశ్వరరావు లాంటి సీనియర్లు కూడా కథలు రెడీ చేసుకుని, మెగా ఫోన్లు పట్టడానికి సన్నాహాల్లో ఉన్నారు. వీరిద్దరూ ఒకప్పుడు హిట్లు కొట్టినవాళ్లే. అందరికీ.. ఒక్కో చరిత్ర ఉంది. అయితే ఈ తరాన్ని మెప్పించేలా కథలు వండగలరా? ఈ పరుగు పందెంలో… నిలవగలరా? అన్నది ఆసక్తిగా మారింది. ఆ తరం సినిమా వేరు, ఇప్పటి సినిమా వేరు. మెలోడ్రామాలకూ, కామెడీ ట్రాకులకూ చోటులేని సినిమా ఇది. వాస్తవికతే.. విజయసాధనం. మరి దాన్ని పట్టుకోగలరా? మెప్పించగలరా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి వీళ్లలో ఎవరు, ఏ మేరకు మెప్పిస్తారో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.