భూమా నాగిరెడ్డి చనిపోయేవరకూ ఆయనకు కుడిభుజంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు.. ఆయన కుమార్తె భూమా అఖిలప్రియపై ఆరోపణలు చేస్తూ.. రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నారు. అఖిలప్రియ దంపతులు తనను చంపారని సుపారీ ఇచ్చారంటూ.. సంచలన వ్యాఖ్యలతో మీడియా ముందుకు వచ్చారు. అయితే.. పోలీసులు ఆ విషయాన్ని చెప్పలేదు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర చేశారంటూ.. ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠాకు సుపారీ ఇచ్చారని కూడా పోలీసులు గుర్తించారు. ఎవరు ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..? అలాంటి వివరాలు బయట పెట్టలేదు. కానీ.. ఏవీ సుబ్బారెడ్డి మాత్రం.. ఆ సుపారీ ఇచ్చింది అఖిలప్రియ దంపతులేనంటూ మీడియా ముందుకొచ్చేశారు. దీనిపై అఖిలప్రియ మండిపడ్డారు. పోలీసులు చెప్పకుండా.. ఇలా ఆరోపణలు చేయడం ఏమిటన్నారు.
వెంటనే.. ఏవీ సుబ్బారెడ్డి అఖిలప్రియ వ్యాఖ్యలు స్పందించారు. తనకు పోలీసులే చెప్పారని…అందుకే తాను ప్రకటించానని చెప్పుకొచ్చారు. భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి ల రాజకీయ జీవితానికి తన ప్రాణాలు అడ్డేసి.. అనేక సందర్భాల్లో వ్యవహరించానని బాంబు దాడులను ఎదుర్కొన్నానన్నారు. ఇప్పుడు వారి కుమార్తె తనను చంపడానికి సుపారి ఇచ్చేంత తప్పు తానేం చేశానని ఆయన ప్రశ్నిస్తున్నారు. తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో కానీ.. భూమా కుటుంబానికి తనకు మధ్య ఆర్థిక లావాదేవీలు లేనని ఆయన స్పష్టం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి పేరు ఏమైనా నాగిరెడ్డికి చెందిన బినామీ ఆస్తులు ఉంటే.. ఏవీ సుబ్బారెడ్డికే చెందుతాయని.. భూమా అఖిలప్రియ కూడా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఏవీ సుబ్బారెడ్డి చెప్పి.. తమ మధ్య ఆర్థిక వివాదాలు లేవని తేలిపోయిందంటున్నారు.
ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఒకే పార్టీలో ఉండి… ఇలా ఒకరిపై ఒకరు సీరియస్గా హత్యయాత్నాలు.. సుపారీ ఆరోపణలు చేసుకుంటూండటం.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. అయితే.. అది కర్నూలు జిల్లా టీడీపీ నేతలు కుటుంబ సమస్యగా చూస్తున్నారు. అయితే.. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు సుపారీని… భూమా అఖిలప్రియ దంపతులు ఇచ్చి ఉంటే పోలీసులు ఆ విషయాన్ని బయట పెట్టాలి కానీ.. ఏవీ సుబ్బారెడ్డికి మాత్రమే చెప్పడం ఏమిటన్న చర్చ అక్కడి రాజకీయవర్గాల్లో వస్తోంది.