చిరంజీవి నేతృత్వంలో ఇటీవల కేసీఆర్ ని కలిసిన సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఏపీ లో షూటింగ్ అనుమతులు, సింగిల్ విండో అనుమతుల విధానం, రాయితీలు, పరిశ్రమకి కావలసిన ప్రోత్సాహకాల విషయంలో సీఎం జగన్ తో చిరంజీవి నేతృత్వంలోని బృందం చర్చించనుంది. అయితే ఈ భేటీకి కూడా బాలకృష్ణ హాజరు కావడం లేదని నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కెసిఆర్ తో సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అయి సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించిన తర్వాత ఆ భేటీకి తనను పిలవలేదంటూ బాలకృష్ణ అలిగిన సంగతి తెలిసిందే. తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చుని ఈ సినీ పెద్దలు భూములు పంచుకుంటున్నారా అని ఆయన ఆక్రోశాన్ని వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ తో భేటీకి బాలకృష్ణ ని కూడా ఆహ్వానించారు. అయితే సినీ పరిశ్రమకు జగన్ అపాయింట్మెంట్ జూన్ పదవ తేదీన కుదిరింది. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇచ్చిన తేదీ బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో, ఆయనను మేము ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరు కాలేకపోతున్నారు అంటూ ప్రకటించారు. ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల లో జరిగిన ఇండస్ట్రీ సమావేశాలలో చాలావాటికి బాలకృష్ణ హాజరు కాలేకపోయారు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే నిర్మాత కళ్యాణ్ బాలకృష్ణ హాజరు కాలేక పోతున్నారని ప్రకటించినప్పటికీ, బాలకృష్ణ కూడా ఈ సమావేశానికి హాజరు అయితే బాగుంటుందనే అభిప్రాయం సినీ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఆయన హాజరైతే, సినీ పరిశ్రమ వివాదాలు సద్దుమణిగి పోయాయన్న సంకేతాన్ని ఇవ్వడం తో పాటు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ వైఎస్సార్సీపీ నేత జగన్ ని కలిస్తే, పార్టీలకతీతంగా సినీ పరిశ్రమ కోసం బాలకృష్ణ ముందడుగు వేశారని సంకేతం కూడా వెలువడినట్లు అవుతుంది అని సిని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆహ్వానం మేరకు బాలకృష్ణ జగన్ భేటీకి హాజరు అవుతాడా లేక తన పుట్టినరోజు వేడుకల్లోనే నిమగ్నం అవుతారా అన్నది వేచి చూడాలి.