ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పేరు మార్చి.. నిబంధనలు మార్చి.. ప్రజాధనాన్ని ప్రైవేటు కాలేజీలకు దోచి పెడుతున్నారని.. తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అర్హత లేని కాలేజీల్లోనూ ఇష్టానుసారం ఫీజులు పెంచారని.. వైసీపీకి కావాల్సినవారి కాలేజీలకు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచి… అర్హత ఉన్న కాలేజీల్లో ఫీజులు తగ్గించారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదన్న మోహన్‌బాబు ఇప్పుడు హైకోర్టుకు వెళ్లడంలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు.. ప్రభుత్వ లోటుపాట్లను.. ప్రత్యేకంగా వివరాలతో సహా మీడియా ముందు పెడుతున్నారు. పథకాల అమలుపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రమైన విమర్శలు చేశారు.
గత ప్రభుత్వ పథకాలకే వైసీపీ ప్రభుత్వం పేర్లు మార్చుతోందని.. అన్నదాత సుఖీభవ పథకం పేరు మార్చి రైతు భరోసా ఇని పెట్టారని.. అయితే.. ప్రభుత్వ విధానాల వల్ల 23లక్షల మంది రైతులకు.. టీడీపీ హయాంలో లబ్దిదారులుగా ఉండి కూడా ఇప్పుడు పథకాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేసేది గోరంత, ప్రచారం కొండంత అని మండిపడ్డారు. గతంలో ఉన్న స్కాలర్ షిప్ పథకానికి జగనన్న వసతి దీవెన , అమృతహస్తం పథకానికి జగనన్న గోరుముద్దగా మార్చారని విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టిన డ్వాక్రా రుణాలను ఇంతవరకు మాఫీ చేయలేదని … సున్నా వడ్డీకి కొంత సొమ్ము ఇచ్చి..గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
వైఎస్, చంద్రబాబు హయాంలోనూ సున్నా వడ్డీ పథకం ఉందని .. సున్నా వడ్డీ కింద గత ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తే…వైసీపీ ప్రభుత్వం రూ.3లక్షలే ఇస్తోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. మహిళల ఖాతాల్లో రూ.15వేలు వేస్తామన్న హమీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రచారం కోసం పాకులాడుతున్నారని .. నిజంగా ప్రజలకు మేలు చేయాలని అనుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఉండి.. ఆపేసిన పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రముఖంగా ప్రజల్లోకి చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తోంది. అలాగే.. పాత పథకాలు…పేర్లు మార్చిన పథకాల వల్ల.. ప్రజలకు జరిగిన నష్టాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.