న్యాయపరంగా ఎదురు దెబ్బలు తలుగుతూండటంతో ఏపీ ప్రభుత్వం .. తమ లాయర్ల ప్రతిభాసామర్థ్యాలపై దృష్టి పెట్టింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం అడ్వకేట్ ఆన్ రికార్డ్‌గా ఉన్న నాగేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం హఠాత్తుగా తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అఫిడవిట్లు, పిటిషన్లు వేసే బాధ్యతలు చూసుకుంటున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి నియమించాలంటూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఆయన అంత చురుకుగా వ్యవహరించలేదు. దాఖలు చేసిన పిటిషన్లోనూ తప్పుల తడకలు ఉన్నాయి. దీంతో పిటిషన్ లిస్ట్ కాలేదు. ఐదు రోజుల తర్వాత తప్పులు సవరించి పిటిషన్ వేశారు. ఈ కారణంగా.. విచారణకు రావడం ఆలస్యమైంది. దీంతో నాగేశ్వర్ రెడ్డి పనితీరు బాగో లేదని.. భావించిన ఏపీ ప్రభుత్వం ఆయనను తొలగించాలని నిర్ణయించుకుని ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టులో వాదనల కోసం.. సీనియర్ లాయర్లను ఏపీ సర్కార్ నియమించుకుంటోంది. హైకోర్టులోనూ.. ఏపీ సర్కార్ తరపున వాదించేందుకు పెద్ద ఎత్తున లాయర్లను నియమించారు. అడ్వకేట్ జనరల్ ప్రధానంగా సర్కార్ తరపున వాదిస్తూంటారు. ఇతర లాయర్ల బృందం ఉంటుంది. గత ఏడాది కాలంలో… ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీంతో… ఏపీ సర్కార్.. న్యాయసేవలు అందిస్తున్న వారి ప్రతిభను మదింపు చేసి… వారి పెర్ఫార్మెన్స్ను… పరిశీలన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిశీలన తర్వాత పలువుర్ని పక్కకు పెట్టేసి.. మరికొంత మంది కొత్త వారిని న్యాయసేవల కోసం తీసుకుంటారని చెబుతున్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చట్ట పరంగానే ఉన్నాయని… న్యాయస్థానాల ముందు వాదించడంలో ప్రభుత్వ లాయర్లు విఫలమయ్యారు. దాదాపుగా 65 సార్లు హైకోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే.. వీటిని తాము ఓడిపోయామనో.. చెంప పెట్టు అనో తాము భావించబోమని.. అడ్వకేట్ జనరల్… మీడియాకు చెప్పారు. హైకోర్టు తీర్పుపై మీడియా ముందుకు వచ్చిన అడ్వకేట్ జనరల్‌గా కూడా.. ప్రస్తుత ఏజీ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ లీగల్ టీంను పునర్వ్యవస్థీకరించుకునే ప్రయత్నం చేస్తోంది.