తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం… దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించింది. కొత్త సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్లకు పర్మిషన్ ఇవ్వడం లేదు. సగం పూర్తయిన సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్ లకు మాత్రమే అనుమతి ఉంటుందని… తెలంగాణ సర్కార్ ప్రకటించింది. షూటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరి చేశారు. అలాగే.. మాస్క్, భౌతికదూరం పాటించాల్సిందే. షూటింగ్ ఏరియాలో పాన్, సిగరెట్లు నిషేధించారు. తప్పనిసరిగా ఓ డాక్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలి. షూటింగ్ ప్రారంభించే ముందు.. సినిమా షూటింగ్లో పాల్గొనే వారందరికీ.. భౌతిక దూరం ఆవశ్యకతను గురించి ప్రత్యేకంగా వివరించాల్సి ఉంటుంది.
ఒక్క షూటింగ్ లో 40మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత నిర్మాతలదేనని.. కార్లను శానిటైజ్ చేసిన తర్వాతే ఆర్టిస్టుల దగ్గరికి పంపాలని విధివిధానాల్లో పేర్కొన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ ప్రాంతాల్లో తప్పనిసరిగా శానిటైజర్, హ్యాండె వాష్ అందుబాటులో ఉంచాలని.. కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్ లు చేయకూడదని నిబంధనలు పెట్టారు. వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ లు జరపకూడదని.. ఇండోర్ షూటింగ్ లకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మేకప్ వేసుకున్నా ఆర్టిస్టులు ఫేస్ షీల్డ్ ను ఉపయోగించాలని.. మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రస్సర్లు పీపీఈ కిట్లు ధరించాలనే నిబంధన పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా..ఈ నిబంధనలు అన్నీ ఉపయోగపడతాయి.
కానీ..సినిమా షూటింగ్ లో ఇవన్నీ అమలు చేయడం సాధ్యమా అంటే.. కష్టమనే చెప్పుకోవాలి. సినిమాల్లో ఆర్టిస్టులు దగ్గర దగ్గరగానే ఉంటారు.. పాటల్లాంటివి అయితే.. ఒకరి మీద ఒకరు పడిపోవాల్సి ఉంటుంది. వారికి మినహాయింపు ఇచ్చినా మిగతా వారికి కావాల్సింతగా.. నిబంధనలు అమలు చేయడం కష్టమే. పైగా..అదనపు ఖర్చు కూడా. అయినా మధ్యలో ఆగిపోయిన సినిమాల నిర్మాతలు అసలు ఆగిపోవడం కన్నా.. ఏదో ఒకటి జరగడం మంచిదని భావిస్తున్నారు.అందుకే.. నిబంధనలకు అనుగుణంగా వారు షూటింగ్లు ప్రారంభించే అవకాశం ఉంది.