•చట్టబద్దత లేని నిర్ణయాలతో నెట్ న్యూట్రాలిటీ నిలబడుతుందా?
•ఒక అడుగు వెనక్కి వేసిన ఫేస్ బుక్ రెట్టించిన కసితో విరుచుకుపడుతుందా?
భారత దేశంలో ఇంటర్నెట్ తటస్థతకు మరింత ఊతం లభించింది. ఫ్రీబెసిక్స్‌తో కలకలం రేపిన ఫేస్బుక్ సంస్థ ఆ కార్యక్రమాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీసుల అందుబాటు విషయంలో ఎలాంటి అంతరాలు ఉండకూడదంటూ భారత్ టెలికామ్ నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ణయించిన నేపథ్యంలో ఫేస్బుక్ ఈ ప్రకటన చేసింది.
నెట్ న్యూట్రాలిటీకే కట్టుబడి ఉండాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని రెండు సంవత్సరాల తరువాత సమీక్షించాలంటూ ట్రాయ్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ గడువులో ముగిసేసరిక ఫేస్ బుక్ మొదలుగా సోషల్ మీడియాగాని, ఇతర నెట్ వర్క్ లుగాని మరోరూపంలో నెట్ న్యూట్రాలిటీకి గండికొట్టే ప్రమాదం వుంది. ఈలోగా నెట్ న్యూట్రాలిటీ పై చట్టంగా రూపొందాలి.ప్రధాని నరేంద్రమోదీ నినాదమైన డిజిటల్ ఇండియా స్వేచ్చా స్వతంత్రాలకు ఈ చట్టబద్ధత అవసరం. ఇంటర్నెట్ తటస్థతకు పూచీ ఇచ్చే చట్టాలేవీ లేకపోవడమే భవిష్యత్తుపై అనుమానానికి కారణం.
పెట్టుబడిదారీ ఆర్ధికవిధానమే దేశానికి అవసరమనో అనివార్యమనో నమ్మి, అనుసరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో స్వయంగా వెళ్ళి సంభాషించిన ఫేస్ బుక్ అంటే ఆషామాషీ కాదు. 144 దేశాల జిడిపి కన్నా ఫేస్బుక్ ఆదాయమే ఎక్కువ.
అంతటి ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఫేస్బుక్ ప్రారంభించిన ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ భారత్‌లో ఇంటర్నెట్ తటస్థతపై చర్చను తీవ్రతరం చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది నెట్ నిరక్షరాస్యులకు ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురావడం, దేశ వ్యాప్తంగా ఫ్రీ బేసిక్స్ పేరిట ఉచిత సేవలను అందించడం తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఫేస్బుక్ ప్రకటించింది. ఫ్రీబేసిక్స్ పేరిట ఫేస్బుక్ 300 వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. భారీగా యాడ్స్ గుప్పించింది. తన సొంత మీడియా అయిన ఫేస్బుక్లో ఇంటర్నెట్ స్వేచ్ఛ అంటూ పెద్దసంఖ్యలో ఉన్న ఫేస్బుక్ వినియోగదారుల మద్దతు సమీకరించే పని ప్రారంభించింది.
వాస్తవం మాత్రం దీనికి భిన్నం. ఫేస్బుక్ చేతిలోకి వెబ్సైట్లు వెళ్లిపోతాయి. దీనిని ఆధారంగా చేసుకుని భవిష్యత్‌లో కోట్ల రూపాయలు వసూలు చేసుకునే అవకాశం ఆ సంస్థకు వస్తుంది. మరోవైపు సాధారణ ప్రజలూ ఇప్పుడున్న ఏ సమాచారాన్నైనా అప్లోడ్ చేసుకోవడం, కోరుకున్న సమాచారాన్ని తీసుకునే సౌకర్యాన్ని కోల్పోతారు. తమతో ఒప్పందానికి వచ్చిన కొన్ని వెబ్సైట్లని మాత్రమే ఫేస్బుక్ ఉచితంగా అందుబాటులో ఉంచుతుంది మిగిలిన వెబ్సైట్ల కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కోరుతున్న సమాచారాన్ని బట్టి కూడా ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని నెటిజన్లకు అర్ధమయ్యేలా చెప్పడంలో ”స్వేచ్చ” సాధించిన విజయమే ట్రాయ్ నిర్ణయానికి ఆధారమైంది.
ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న ఐటి ఉద్యోగులు, నిపుణులు చేసిన కృషి అంతాఇంతాకాదు. ఒక విధంగా వీరు చేసిన కృషి ఇంటర్నెట్ అంటే ఏమిటో తెలియని వారికి కూడా ఫేస్బుక్ అదర్ సైడ్ ఏమిటో అర్థమయ్యేలా చెప్పింది. మేధావుల నుండి సామాన్యుల వరకు ‘నో టు ఫ్రీ బేసిక్స్’ అనేలా చేసింది.
భారీ లాభార్జన అంచనాలకు గండి పడింది కాబట్టే, ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ ట్రాయ్ నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఉడుకుమొతు తనాన్ని దాచకోలేకపోయిన ఆయన భాగస్వామి ఇండియాకు బ్రిటీష్ పాలనే మేలు అనేసి నాలుక కరచుకుని తన ఉద్దేశం అదికాదు అని వివరణ ఇచ్చకున్నారు.