ఆంధ్రప్రదేశ్లో కూడా టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం తోసి పుచ్చింది. ఏపీలో టెన్త్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని విద్యా మంత్రి ఆదిమూలం సురేష్ ప్రకటించారు. జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని.. విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో టెన్త్ పరీక్షలు రద్దు చేశారు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ… రద్దు చేసి.విద్యార్థులందర్నీ పై తరగతులకు పంపించారు. దీంతో ఏపీలోనూ పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి.
అయితే.. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ఇంకా నెల రోజులు ఉంది. కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి అయితే పరీక్షల నిర్వహణకు ఇబ్బంది ఉండదు కానీ.. పెరిగితే మాత్రం.. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అంచనా ప్రకారం.. కరోనా కేసులు పెరుగుతాయే కానీ తగ్గే అవకాశం లేదు. వీలైనంతగా… పిల్లల్ని, వృద్దుల్ని బయటకు రాకుండా చూసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
అంతగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటే.. తెలంగాణ, తమిళనాడు రద్దు నిర్ణయం ఎందుకు తీసుకుంటాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం… పరీక్షలు జరిగి తీరుతాయని ప్రకటిస్తుంది కానీ… పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించక తప్పదన్న అంచనాలున్నాయి.