పుట్టిన రోజున ఆశీర్వదించినంత మాత్రాన.. ఏడాది చేసిన పాపాలు మరిచిపోయినట్టు కాదని వైసీపీ సర్కార్‌పై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ మండిపడ్డారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఇటీవల ఆయన సాక్షి పత్రికకు ఇంటర్యూ ఇచ్చారు. ఆందులో.. జగన్ పాలనపై సానుకూల ప్రకటనలు చేశారు. దీంతో.. ఆయన బీజేపీలో ఉన్న జగన్ శ్రేయోభిలాషి అన్న చర్చ ప్రారంభమయింది. అప్పుడే వివరణ ఇచ్చినా.. ఇప్పుడు.. కొత్తగా.. ఏపీలో బీజేపీ వర్చవల్ ర్యాలీలు ప్రారంభించడంతో…తన వాదన నేరుగా చెప్పుకునే అవకాశాన్ని పొందారు. ప్రధాని మోదీ ఏడాది పాలనపై బీజేపీ వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తోంది. కోస్తాంధ్ర బీజేపీ నేతలతో వీడియో ద్వారా…
బహిరంగ సభను రామ్‌మాధవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మోడీ పాలనను పొడిగి.. తర్వాత జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రోగ్రెస్ మంత్రంతో ముందుకెళ్తుంటే… ఏపీలో రివర్స్ మంత్రం నడుస్తోందని రాం మాధవ్ విమర్శించారు. రాజధానితో మొదలైన రివర్స్ నడుస్తూనే ఉంది.. మద్యపాన నిషేధం విషయంలోనూ రివర్స్ అడుగులు పడ్డాయన్నారు. హైకోర్టుతో 60సార్లు మొట్టికాయలు తిన్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరు వల్ల మొత్తం ఆదాయం లేకుండా పోయిందని.. కేంద్రం కోవిడ్‌ను డిజాస్టర్‌గా భావించి రూ.11వేల కోట్లు ఏపీకి ఇచ్చిందన్నారు.
సందర్భం లేకపోయినా చంద్రబాబు ఎన్డీఏ నుంచి వెళ్లడంపై రామ్‌మాధవ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. చంద్రబాబుకు బీజేపీతో సాగడం ఎందుకు నచ్చలేదో…ఏం అత్యాశ ఉందో మనకు తెలియదని చెప్పుకొచ్చారు. ప్రధాని పదవి ఆశ కలిగించిందో, రాజకీయ స్వలాభమో బయటకు వెళ్లిపోయారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిణామాలతో.. ఏపీలో బీజేపీ వేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా.. ఢిల్లీ స్థాయిలో మాత్రం.. వైసీపీకి అనుకూలత ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామ్‌మాధవ్..ఆ అభిప్రాయాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు.