కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తలుగుతూ ఉండటంతో ఏపీ సర్కార్.. తాను నియమించుకున్న న్యాయవాదులపై వేటు వేస్తూ పోతోంది. ఇప్పటికే ఢిల్లీ సుప్రీంకోర్టులో నియమించుకున్న ఓ న్యాయవాదిని ఇంటికి పంపేసిన ప్రభుత్వం తాజాగా.. హైకోర్టులో మరో ముగ్గురు న్యాయవాదులతో రాజీనామా చేయించింది. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్ హబీబ్ అనే న్యాయవాదులు ప్రభుత్వ లాయర్లుగా తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించలేకపోతున్నారన్న కారణంగా వారిపై వేటు వేసినట్లుగా తెలుస్తోంది. వారితో ఇలా రాజీనామా తీసుకుని అలా ఆమోదించారు. ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభు్తవ వర్గాలు చెబుతున్నాయి.
ఏడాది కాలంలో హైకోర్టులో 60కిపైగా ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వచ్చాయి. పీపీఏల దగ్గర్నుంచి ఎస్ఈసీ నియామకం వరకూ అనేక అంశాల్లో కోర్టు చీవాట్లు పెట్టింది. రెండు సార్లు పోలీస్ బాస్ డీజీపీ హైకోర్టు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. కోర్టు ధిక్కరణ ఆదేశాల భయంతో..సీఎస్ కూడా.. రెండు రోజులు వరుసగా కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. అసాధారణ రీతిలో..హైకోర్టు తీర్పునకు ప్రత్యేకంగా అర్థం చెబుతూ… అడ్వకేట్ జనరల్ ప్రెస్‌మీట్ పెట్టారు.
అయితే.. కింది స్థాయి న్యాయవాదులతో రాజీనామా చేయించడంపై …న్యాయవాద వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏ కేసు విషయంలో అయినా ప్రధానంగా అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరాం.. అసిస్టెంట్ అడ్వకేట్ జరనల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలే డీల్ చేస్తూంటారు. వారు చెప్పినట్లుగానే… ఇతర లాయర్లు వాదించాల్సి వస్తే వాదిస్తూంటారు. నిజానికి రాజీనామా చేసిన ముగ్గురు లాయర్లు.. ఎక్కువగా డాక్యుమెంటేషన్ పనే చేస్తూంటారని..తెలుస్తోంది. వారంతటకు వారు నేరుగా.. కోర్టుల్లో వాదించిన సందర్భాలు.. ఆ కేసుల్లో తీర్పులు వ్యతిరేకంగా వచ్చిన సందర్భాలు తక్కువేనంటున్నారు. మరిఎందుకు వారితో రాజీనామా చేయించారో అర్థం కావడం లేదన్న అభిప్రాయం.. ప్రభుత్వ అనుకూల న్యాయవాద వర్గాల్లోనే ఉంది.