కేంద్ర ప్రభుత్వం తీసుకు రాదల్చిన విద్యుత్ సంస్కరణలపై ఏపీ సర్కార్ ఎట్టకేలకు తన వ్యతరికేతను ఢిల్లీకి పంపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్ర చట్టంపై బహిరంగ వ్యతిరేకత తెలిపారు. అలాగే ఘాటుగా కేంద్రానికీ లేఖ రాశారు. కాస్త ఆలస్యంగా ఏపీ కూడా.. తన వ్యతిరేకతను.. తెలుపుతూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం తేవాలనుకున్న సంస్కరణలకు ఆమోదం తెలిపితే.. విద్యుత్ రంగం పూర్తిగా కేంద్ర అధీనంలోకి వెళ్లిపోతుంది. ప్రజలకు.. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీల దగ్గర్నుంచి విద్యుత్ చార్జీల నిర్ణయం వరకూ.. అంతా కేంద్రం గుప్పిట్లో ఉంటుంది. అంటే.. ఓ రకంగా.. కరెంట్ అనేది..ఉమ్మడి జాబితా నుంచి .. కేంద్ర జాబితాకు మారినట్లు అవుతుంది.
దీనిపై అనేక రాష్ట్రాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించడానికి అవకాశం లేదు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే.. వీటిలోనూ.. కొన్ని ఢిల్లీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాయి. అలాంటి ప్రభుత్వాల్లో ఏపీ ఒకటి. కేంద్ర విద్యుత్ సంస్కరణలు తీవ్ర నష్టం చేస్తాయని తెలిసి కూడా… ఇంత ఆలస్యంగా స్పందించడానికి ఇది కూడా ఓ కారణం అనుకోవచ్చు. కొత్త చట్టంలో సవరణలు సూచిస్తున్నట్లు ఏపీ రాసిన లేఖ ఉన్నప్పటికీ.. ఆ సవరణలన్నీ.. బిల్లు మౌలిక ఉద్దేశాలను దెబ్బతీసేలా ఉండటంతో కేంద్రం ఆమోదించే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది.
అసలు కేంద్ర ప్రభుత్వం ఈ విద్యుత్ సంస్కరణలను తీసుకురావడానికి ఏపీ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారం చేపట్టగానే పీపీఏలు రద్దు చేయడంతో ఆయా సంస్థలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. అవన్నీ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు కావడంతో…దేశంలోని పెట్టుబడి వాతావరణం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఏపీ లాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ రానివ్వబోమని ఇందు కోసం చట్టం చేస్తామని హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ పీపీఏల సమస్య పరిష్కారం కాలేదు. చట్టంతో లెక్క సరిపోతుదంని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.