ప్రభుత్వ న్యాయవాదుల పనితీరును సమీక్షిస్తున్న ఏపీ ప్రభుత్వం… పెద్ద ఎత్తున ఊస్టింగ్ ఆర్డర్స్ రెడీ చేసింది. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదిని ఇంటికి పంపిది. నిన్న హైకోర్టులో ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదుల్ని ఇంటికి పంపింది. ఇప్పుడు ఈ ఊస్టింగ్ జాబితాలో మరో ఏడుగురు ప్రభుత్వ న్యాయవాదులు.. పధ్నాలుగు మంది సహాయ ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరాం.. అందరి పనితీరును సమీక్షించి.. ఎవరెవర్ని తీసేయాలో.. ఓ జాబితా తయారు చేసి ఏపీ సర్కార్కు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
తప్పు చెప్పిన పని చేసేవాళ్లదా..? ఆ పని చేయమని చెప్పేవాళ్లదా..?
ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలు వినిపించడం లేదని కింది స్థాయి న్యాయవాదుల్ని తీసేయాలనుకోవడం న్యాయవాద వర్గాల్లో సహజంగానే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. తీసివేయబడిన.. తీసివేస్తారని ప్రచారం జరుగుతున్న లాయర్లు ఎవరూ ప్రభుత్వం తరపున కీలక కేసుల్లో వాదించలేదు. వారు ఎక్కువగా పిటిషన్లు, కౌంటర్లు వంటి బాధ్యతలు చూస్తూంటారు. ఎప్పుడైనా వాదించాల్సి వచ్చినా.. పై స్థాయి నుంచి వచ్చిన సూచనల మేరకే వాదిస్తారు. అంటే.. వారంతా చెప్పిన పని చేసేవాళ్లు మాత్రమే. అసలు ఆ పని చేయమని చెప్పే వాళ్లు వేరే ఉంటారు. ఎలాంటి పరిణామాలకు అయినా వారే బాధ్యులు కావాల్సి ఉంటుంది. కానీ కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఇలాంటి అబిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
జగన్ను న్యాయవ్యవస్థ వ్యతిరేకిలా మార్చిన న్యాయసలహాదారులు..!
న్యాయవ్యవస్థకు బద్ద వ్యతిరేకిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును తీర్చిదిద్దేలా.. ఆయన న్యాయ సలహాదారులు.. ఇతర బృందం… తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవని.. సామాన్యులు కూడా అంచనా వేయగలిగే అంశాలను.. సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లి.. ప్రభుత్వానికి మొట్టికాయలు వేయిస్తోంది… జగన్ లీగల్ టీం. ఓ ముఖ్యమంత్రి అన్ని వ్యవహారాలను చక్క బెట్టుకోలేరు… ఆయన తరపున వ్యవహారాలు చక్క బెట్టడానికి ఓ వ్యవస్థ ఉంటుంది. అందులో సలహాదారులు.. అధికారులు.. అంటారు. అలాగే న్యాయ వ్యవహారాలు చూడటానికి కూడా ఓ టీం ఉంటుంది. అయితే. ఈ టీం జగన్మోహన్ రెడ్డికి మంచి చేయడంలేదు సరి కదా… చట్ట విరుద్ధమైన సలహాలతో.. హైకోర్టులోనూ.. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం పరువు పోయేలా చేస్తున్నారన్న చర్చ కొంత కాలం నుంచి నడుస్తోందంి.
సలహాలిచ్చిన “న్యాయపెద్దలు” సీఎం ఇమేజ్ను దెబ్బతీస్తున్నారా..?
అసాధారణ రీతిలో అడ్వకేట్ జనరల్ హైకోర్టు తీర్పునకే..కొత్త అర్థం చెప్పి.. నిమ్మగడ్డ నియామకంపైనే అనుమానాలు వ్యక్తం చేయడమే కాదు.. దాన్నే న్యాయ సలహాగా ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వానికి కోర్టుల్లో 65 సార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ నిర్ణయాలు చట్టపరంగా ఉండేలా చూసుకోవడంలో.. వాటిపై కోర్టుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వ లాయర్లు విఫలమయ్యారని స్పష్టమవుతోంది. గతంలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఓ తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు కప్పి పుచ్చుకోవడానికి న్యాయ బృందం.. రకరకాల విన్యాసాలు చేసి.. కోర్టులకు వెళ్లి మళ్లీ ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా.. కోర్టు తీర్పులను ధిక్కరించేలా.. చేస్తోంది కానీ.. సరైన సలహాలు ఇవ్వడడం లేదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.