“విభజించు.. పాలించు” అనే సూత్రాన్ని బ్రిటిష్ వాళ్లు పాటించి…. దేశాన్ని సుదీర్ఘంగా పాలించగలిగారని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ ఏకమయ్యాయా..? వివక్షపై పోరాడుతున్నామా..?.. పేదరికంపై పోరాటానికి.. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం ద్వారా.. దేశాభివృద్ధికి ప్రయత్నిస్తున్నామా..? అని ఆలోచిస్తే.. ఎక్కడా సమాధానం దొరకని పరిస్థితి. నాటి బ్రిటిష్ సిద్ధాంతం.. నేడు దేశంలో మరో రకంగా అమలవుతోంది. రాజకీయ పార్టీలు ప్రజల్ని కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా విడగొట్టేశాయి. ఈ విభజన ఎంత దారుణంగా ఉందంటే.. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఏదో జరిగితే.. పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నాం కానీ… అలాంటి ఘటనలే మన కళ్ల ముందు జరిగిదే బాధితులకు కులం, మతం, ప్రాంతం, వర్గం.. పార్టీలు.. అంటగట్టి.. వాళ్లకి అలా జరగాల్సిందేననని తీర్మానిస్తున్నారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన.. ఇండియాలో సుధాకర్ ఘటన.. రెండూ.. ప్రపంచ మీడియాలో హైలెట్ అయ్యాయి. కానీ.. ఫ్లాయిడ్ ఘటనకు వచ్చిన స్పందనకూ… సుధాకర్ ఇష్యూకు వచ్చిన స్పందనకు తేడా చూస్తే.. మనం ఎంతగా విడిపోయామో… విభజనకు గురయ్యామో స్పష్టంగా అంచనా వేసుకోవచ్చు.
ఐక్యతలోనూ అమెరికా అగ్రరాజ్యమే..!
అమెరికా ఆర్థిక పరంగా అగ్రరాజ్యం. ఇప్పుడు ఐక్యతలోనూ అగ్రరాజ్యమేనని అక్కడి ప్రజలు నిరూపించారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని పోలీసులు క్రూరంగా హత్య చేస్తే.. ఆయనకు మద్దతుగా.. నల్ల జాతీయులు ఎదుర్కొంటున్న వివక్షకు మద్దతుగా అమెరికా సమాజం నిలబడింది. నల్లజాతీయులు చేస్తున్న ఆందోళనను… తెల్లజాతీయులు తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలుగా భావించలేదు. అలాంటి ప్రయత్నం చేయాలని అక్కడి రాజకీయ పార్టీలు ప్రయత్నించలేదు. తెల్లజాతీయులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు మద్దతిచ్చారు. సినిమా, క్రీడా రంగ సెలబ్రిటీలు సహా అందరూ.. ఫ్లాయిడ్ కేంద్రంగా జరుగుతున్న నల్లజాతీయుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. అది అమెరికా ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పింది. నిజానికి అమెరికాలో నిఖార్సైన అమెరికన్లు తక్కువే. ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడిన వారిమూలాలే ఎక్కువ. అయినా అక్కడ ఐక్యతకు.. జాతీయతకు.. ఎక్కడా లోటు రాలేదు. అక్కడి రాజకీయ నాయకులు వర్గాల వారీగా మనుషులపై వైషమ్యాల్ని పెంచి.. తమ పబ్బం గడుపుకోవాలనుకోలేదు. ఫలితంగా.. ఐక్యతలోనూ అమెరికా అగ్రరాజ్యంగా కనిపించింది.
ఇండియాలో అలాంటి ఐక్యత ఏది..!?
విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన వైనం… ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీబీసీ సహా ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థలన్నీ.. ఇండియాలో ఇలా జరుగుతోందని.. ప్రచారం చేశాయి. డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద న్యూసెన్స్ చేశారు… ఆయన తప్పు చేశారో లేదో.. సీబీఐ తేల్చుతుంది.. కానీ ఆయనతో పోలీసులు వ్యవహరించిన విధానం మాత్రం.. సరి కాదని.. అందరూ చెప్పుకున్నారు. నిమ్నవర్గానికి చెందిన డాక్టర్ కావడం వల్లనే ఇలా చేశారని.. ఇండియాలో పరిస్థితులు ఉన్నాయని అందరూ విశ్లేషించారు. సరిగ్గా అదే సమయంలో అమెరికాలో ఫ్లాయిడ్ ప్రాణాలను పోలీసులు తీశారు. రెండు ఘటనలకు పెద్ద తేడాలేదు. అక్కడ ఫ్లాయిడ్ భౌతికంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ సుధాకర్ మానసికంగా చంపేయబడ్డారు. ఓ వ్యక్తిని అంత దారుణంగా ట్రీట్ చేసి.. పిచ్చివాడనే ముద్ర వేయడానికి ప్రయత్నించిన తర్వాత ప్రత్యేకంగా ప్రాణాలు తీయాల్సిన పని లేదు. ఆ డాక్టర్ రోజూ.. ప్రాణం పోగొట్టుకుంటూనే ఉంటారు. నిన్నటికి నిన్న విశాఖ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన వ్యక్తం చేసిన ఆవేదన.. ఎవరికైనా అదే నిజమని అనిపించక మానదు. కానీ ఫ్లాయిడ్‌కు మద్దతుగా అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన.. సుధాకర్ విషయంలో.. కొంచెమంటే కొంచెం కూడా రాలేదు. ఆయనపై సానుభూతి వ్యక్తం చేయడానికి కూడా చాలా మందికి మనసు రాలేదు. అక్కడే తేలిపోయింది… భారతీయులు… ఎంత దారుణంగా విభజనకు గురయ్యారో. రాజకీయ పార్టీల వారీగా.. కులాల వారీగా.. వర్గాల వారీగా.. మతాల వారీగా.. ఇంకా.. మతాల్లో.. కులాల్లో వర్గాల వారీగా విభజనకు గురయ్యారు. ఇలా విభజనకు గురి చేసి.. బాధితులపై ఏదో ఓ వర్గం ముద్ర వేస్తే.. మిగతా వారంతా.. వాడికి అలా జరగాల్సిందే.. అని సైకో ఆనందం పొందే మానసిక స్థితికి రాజకీయ పార్టీలు తెచ్చేశాయని ఈ ఘటన నిరూపించింది.
మన ప్రజల్లో బాధితులు… ఫ్లాయిడ్ పాటి సానుభూతికి పనికి రారా..?
ఎక్కడెక్కడో అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో దారుణంగా హతమైతే.. అమెరికాలో నల్లజాతిని అణచివేస్తున్నారంటే.. ఇండియాలో లేచిన గొంతులకు లెక్కే లేదు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. రెచ్చిపోయే మేధావుల సంఖ్య తక్కువేం లేదు. సోషల్ మీడియా వేదికగా… అమెరికాలో నల్లవారి హక్కుల కోసం ఇండియా నుంచి పోరాడిన మేధావులు లక్షల మంది ఉన్నారు. మరి.. మన దేశంలో మానన హక్కులను కోల్పోతున్న వారు.. పాలకుల అధికార మదం ముందు… శారీరక.. మానసిక హత్యలకు గురవుతున్న వారికి హక్కులు ఉండవా..? వారి కోసం ఎప్పుడూ నిలబడరా..? ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సుధాకర్ ఘటన మాత్రమే.. కాదు… దేశంలో.. ఎన్నో వివక్షా పూరిత ఘటనలు జరుగుతున్నాయి. మతం ఆధారంగా.. కులం ఆధారంగా… వర్గం ఆధారంగా జరుగుతున్న దాడులకు లెక్కే లేదు. అయినా వారందరికీ.. ఎవరూ అండగా నిలబడటం లేదు. మా వర్గం కాదుగా స్పందించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. మా కులం కాదుగా.. మాకేంటి అనుకుంటున్నారు. చివరికి మా పార్టీ కూడా కాదుగా.. మేం సైలెంట్ అనుకుంటున్నారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నది.. సుధాకర్ లాంటి డాక్టర్‌కే అలాంటి పరిస్థితి ఎదురయినప్పుడు.. సాక్ష్యాలతో సహా కళ్ల ముందు ఉన్నట్లయింది. కానీ ఆయనకే న్యాయం దక్కనప్పుడు… బాధితుడైన ఆయనకే సానుభూతి దక్కనప్పుడు… భవిష్యత్‌లో ఎవరికీ దక్కబోదు.
దేశాన్ని ప్రత్యేకంగా విభజించాల్సిన పని లేదు.. పార్టీలు ఆ పని పూర్తి చేశాయ్..!
ఓ కాకి చనిపోతే.. వందల కాకులు గుమికూడతాయని చెప్పుకుంటాం. జంతువుల్లో అన్నీ అంతే. ఎందుకంటే.. వాటికి కులం లేదు..మతం లేదు. కానీ మనిషికి మాత్రం.. కులం, మతమే కాదు… రాజకీయ వర్గం కూడా వచ్చి చేరింది. ఫలితంగా ఇప్పుడు ప్రజలు ఒకరికొకరు సమానం కాదు. అందరి హక్కులూ సమానం కాదు. అధికారంలో ఉన్న వారి హక్కులు వేరేగా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీల హక్కులు వేరేగా ఉంటాయి. పార్టీలతో సంబంధం లేని ప్రజల హక్కులు వేరేగా ఉంటాయి. రాజ్యాంగ పరంగా.. ఒకరి హక్కులకు నష్టం కలిగితే.. మరొకరు స్పందించకపోగా… అలా జరగాల్సిందేనని తీర్మానించే నయా మేధావుల సంఖ్య పెరిగిపోతోంది. ఇదంతా.. ప్రజల మధ్య విభజన రేఖలు పెరగడానికే.. తప్ప మరో దానికి ఉపయోగపడవు. దురదృష్టవశాత్తూ.. దేశంలో ఇప్పుడు అదే జరుగుతోంది.
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని మనసా వాచా నమ్మితే.. సరిహద్దుల పరంగా దేశం ఒక్కటిగానే ఉంది.. కానీ ప్రజల మధ్య మాత్రం విభజన జరిగిపోయింది. అందరూ ఏకతాటిపైకి రావాలంటే సాధ్యం కాదు. అంత ఘోరంగా.. రాజకీయ పార్టీలన్నీ కలిసి.. సమాజాన్ని విడగొట్టేశాయ్. ఐక్యత లేకుండా చేశాయి. ఇది భరతీయుల భవిష్యత్‌ను ఎటు తీసుకెళ్తుందో అంచనా వేయడం కష్టం.