చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అర్థరాత్రి పూట అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడకు వెళ్లిన ఏసీబీ అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ఇచ్చి.. వెంటనే విజయవాడకు తరలించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా వంద మందికిపైగా పోలీసులతో అర్థరాత్రి నిమ్మాడలో హడావుడి వాతావరణం నెలకొంది. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో ప్రభుత్వం ఈఎస్ఐ విచారణకు ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం.. విజిలెన్స్ రిపోర్ట్ పేరుతో.. మీడియాలో కూడా.. హైలెట్ అయింది. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. విజిలెన్స్ రిపోర్ట్ పేర్కొన్నదని అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి.
ఈఎస్ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు విజిలెన్స్ చెప్పింది. ఆ నివేదికలో అచ్చెన్నాయుడు పేరును విజిలెన్స్ నేరుగా ప్రస్తావించింది. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని .. టెలీ హెల్త్ సర్వీసెస్ పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో ఆయన ఒత్తిడి చేశారని విజిలెన్స్ పేర్కొంది. నామినేషన్ల పద్ధతిలో మెడిసిన్స్, ల్యాబ్ కిట్లను పూర్తిగా అందజేయాలని కోరూతూ అచ్చెన్నాయుడు… అప్పట్లో డైరెక్టర్ రవికుమార్‌కు లేఖ రాశారని కూడా విజిలెన్స్ చెప్పింది. దీంతో, ఎలాంటి కొటేషన్ లేకుండా.. నామినేషన్ పద్ధతిలో టెలీ హెల్త్ సర్వీసెస్‌కు ఇచ్చినట్టుగా నివేదికలో తేల్చారు.
అయితే.. మీడియాలో వచ్చిన ఈ రిపోర్ట్.. ఆరోపణలు.. వైసీపీ నేతల విమర్శలపై అచ్చెన్నాయుడు అప్పుడే స్పందించారు. టెలీ హెల్త్ సర్వీసెస్ ను ఏపీ కంటే ముందు తెలంగాణలో దీనిని ప్రారంభించారని… తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ అమలు చేయాలని నోట్ పంపాను తప్ప.. వారికే ఇవ్వాలని ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో దీనిని కేటాయించాలని ఆదేశించలేదని, కేంద్రం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా.. అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.