సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అవి క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించేందుకు గ్రామాల బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని.. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలని జగన్ ఎప్పుడు సమావేశం జరిగినా అధికారులకు ఉద్భోధిస్తున్నారు. ప్రకటించిన సమయంలోగా సకాలంలో పథకాలు అందాలని.. ఎవరి దరఖాస్తులను కూడా తిరస్కరించకూడదని స్పష్టం చేస్తున్నారు. అర్హత ఉన్న వారికి పథకాలు అందకపోతే… అధికారులే బాధ్యులని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వస్తున్నారు.
పెన్షన్, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీకార్డులు, రేషన్ కార్డులు… తప్పనిసరిగా అర్హులకు అందాలి, మొదట వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ఆగస్టునుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నానని… పథకాలు అందలేదని ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని సీఎం స్పష్టం చేశారు. పథకాల విషయంలో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం నమ్ముతోంది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా… అర్హులందరికీ లబ్ది కలిగిస్తున్నామని.. ప్రజల్లో సానుకూలత ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందికానీ.. అర్హతల పేరిట… అరవై, డెబ్భై శాతం మందిని అనర్హుల్ని చేస్తోందన్న విమర్శలు విపక్షాల నుంచి ప్రజల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యల ను ప్రభుత్వం అధిగమించాల్సి ఉంది. రెండు నెలలలో సీఎం గ్రామాల పర్యటన ప్రారంభించేనాటికి.., ఆ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా క్షేత్రంలోకి రాలేదు. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. ఇక ముందు ఖచ్చితంగా పర్యటించాలని ఆయన అనుకుంటున్నారు.