ఏపీలో ఇప్పుడు ఈఎస్ఐ స్కాం జరిగిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి.. ఆఘమేఘాలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. తెలంగాణలో.. ఎనిమిది నెలల కిందటే బయటపడింది. తెలంగాణ ఈఎస్ఐలో భారీగా స్కాంలు జరిగాయన్న ఆరోపణలతో ఏసీబీ విచారణ జరిపింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి వ్యవహారాలన్నీ బయటకు లాగారు. దీంతో స్కాం జరిగిందని వెల్లడయింది. డైరక్టర్ ఫేక్ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడం.. బిల్లులు చెల్లింపులు చేయడం.. షెల్ కంపెనీలు సృష్టించడం.. ఇలా అనేక ఆధారాలు దొరకడంతో.. ఫార్మాసిస్ట్ దగ్గర్నుంచి ఈఎస్ఐ డైరక్టర్ వరకూ ఈ అక్రమాల్లో పాలు పంచుకున్న వారందర్నీ అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ డైరక్టర్గా ఉన్న దేవికారాణి.. ఎలా అక్రమాలకు పాల్పడిందో.. తమ చేత ఎలా పనులు చేయించుకున్నారో ఉద్యోగాలు బయటపెట్టారు. ఈ క్రమంలో అనేక ఫేక్ కంపెనీలు.. నగదు లావాదేవీలు బయటకు వచ్చాయి.
భారీ ఆస్తులతో దొరికిపోయిన తెలంగాణ ఈఎస్ఐ మెడికల్ డైరక్టర్..!
తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో.. అవినీతి జరిగిందని పక్కా ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఈఎస్ఐ డైరక్టర్గా ఉన్న దేవికారాణి ఆస్తులను బయటకు తీశారు. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 50 చోట్ల దేవికా రాణి ఆస్తులను గుర్తించగా.. వీటి విలువ రూ. 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ స్కాంలో డబ్బులు చేతులు మారాయని.. ఏసీబీ గుర్తించింది. డైరెక్టర్ దేవికా రాణితో కుమ్మక్కై నకిలీ బిల్లులు సృష్టించిన కంపెనీలపై ఏసీబీ కూపీ లాగింది. షెల్ కంపెనీలు సృష్టించి.. దేవికా రాణి బినామీలుగా ఉన్న వారిని కూడా ఏసీబీ గుర్తించింది. మొత్తంగా దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తితో పాటు మరో 19 మందిని ఏసీబీ అరెస్టు చేసింది.
తెలంగాణలో రాజకీయ ప్రముఖుల హస్తం లేదా..?
తెలంగాణలో ఈఎస్ఐ స్కాం సంచలనం సృష్టిస్తున్నప్పుడు.. విచారణ జరుపుతున్నప్పుడు కూడా.. పలువురు రాజకీయ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఫలానా మంత్రి అల్లుడని.. ఫలానా ఎంపీ బంధువు అని.. చెప్పుకున్నారు. వారిని కూడా ప్రశ్నిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఎలాంటి ప్రశ్నలు రాజకీయ నాయకుల వరకూ వెళ్లలేదు. ఈఎస్ఐ అవినీతిలో వారికి భాగం ఉందని కానీ… మరో విధంగా ప్రమేయం ఉందని కానీ అధారాలు దొరకకపోవడం వల్లే ఏసీబీ అధికారులు రాజకీయ నేతల జోలికి పోలేదని చెబుతున్నారు.
అచ్చెన్నాయుడు అవినీతి చేసిన సొమ్మును ఏసీబీ కనిపెట్టిందా..?
సాధారణంగా ఏసీబీ కేసులు నమోదు చేయాలంటే.. ఓ ప్రాతిపదిక ఉంటుంది. అవినీతి జరిగి ఉండాలి. అంటే.. తీసుకున్న నిర్ణయం ద్వారా.. అవినీతికి పాల్పడిన వ్యక్తి లబ్ది పొంది ఉండాలి. అలా చేస్తేనే అవినీతి జరిగినట్లుగా నిర్ధారిస్తారు. తెలంగాణలో అలాంటివి దొరికాయి కాబట్టి.. కేసులు పెట్టి ఆధారాలు దొరికిన వారందర్నీ అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు… టెలీ హెల్త్ సర్వీసెస్ లెటర్ రాశారని .. నామినేషన్ పద్దతిన కాంట్రాక్ట్ ఇచ్చేశారని ఏసీబీ, విజిలెన్స్ ఆరోపిస్తోంది. అయితే.. అలా చేయడం వల్ల అచ్చెన్నాయుడుకు ఏదైనా లబ్దికలిగిందా.. ఆయన లంచం తీసుకున్నారా.. అన్నదానిపై ఏసీబీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. నిధులు దుర్వినియోగం చేశారనే చెబుతున్నారు. అందుకే తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో ఈఎస్ఐ స్కాం విచారణ అందరికీ ఆసక్తి కలిస్తోంది.