తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డ్రోన్ కేసులో తనను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని.. కుట్ర పూరితంగా పది రోజుల పాటు జైల్లో ఉంచారని నమ్ముతున్నారు. తనను అరెస్ట్ చేసిన పోలీసులపై ఆయన కోర్టుకెక్కారు. చట్ట పరంగా.. తనపై ఫిర్యాదు వస్తే.. తనకు 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని కానీ అలా ఇవ్వకుండా.. నేరుగా అరెస్ట్ చేశారని.. ఇలా చేయడం.. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ.. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్ట్ చేసిన మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావు, నార్సింగ్ ఇన్స్పెక్టర్ గంగాధర్‌పై ఆయన పిటిషన్లో ఫిర్యాదు చేశారు. వీరు తనకు 41ఏ నోటీసులు ఇవ్వకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రేవంత్ పిటిషన్లో వివరించారు.
రేవంత్ రెడ్డి కొన్నాళ్ల కిందట… కేటీఆర్ ఫామ్ హౌస్ అంశాన్ని మీడియాకు వెల్లడించారు. మీడియాను తీసుకుని జన్వాడ వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఫామ్ హౌస్ దృశ్యాలను మాత్రం.. మీడియాకు విడుదల చేశారు. ఫామ్‌హౌస్ దగ్గర రేవంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అదే రోజులు విడిచిపెట్టారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లి… తిరిగి వస్తున్న సమయంలో.. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చూపించారు. వరుస సెలవులు.. ఓ సారి.. న్యాయమూర్తి సెలవు కారణంగా మరోసారి.. ఇలా వాయిదా పడుతూ.. దాదాపుగా పది రోజుల జైల్లో ఉన్నారు. ఆ తర్వాత విడుదల చేశారు.
రేవంత్ రెడ్డి డ్రోన్ వాడారన్నదానికి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని… ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఆ కేసు నిజానికి అరెస్ట్ చేయదగినది కాదని.. చెబుతున్నారు. ఎవరిపైనైనా ఫిర్యాదు వచ్చినప్పుడు చర్యలు తీసుకోవాలంటే .. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. కానీ రేవంత్ కు అలాంటి నోటీసులు ఏమీ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. జైల్లో ఉంచారు. దీంతో రేవంత్ న్యాయపోరాట మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.