తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జేసీ బ్రదర్స్‌కు ఉన్న ట్రావెల్స్ బస్సుల వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జేసీ బ్రదర్స్‌కు ఉన్న ట్రావెల్స్ వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయి. బస్సులన్నింటినీ సీజ్ చేశారు. తర్వాత ట్రాన్స్‌పోర్టుల లారీలపై దృష్టి పెట్టారు. ఇటీవల బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించారని అధికారులు నోటీసులు ఇస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. నకిలీ ఇన్సూరెన్స్‌లు అంటూ.. కేసులు పెట్టారు. ఈ రెండు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అయితే.. ఆ రిజిస్ట్రేషన్లు తప్పుడవంటున్నారు కానీ… అవి చేసిన అధికారుల జోలికి మాత్రం వెళ్లకపోవడం ఈ కేసుల్లో కొసమెరుపులు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిట్ లిస్ట్‌లో.. జేసీ బ్రదర్స్ చాలా కాలం నుంచి ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో.. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు.. సాక్షి పత్రికలో అనేక కథనాలు వచ్చాయి. ఆ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి… సాక్షి ఆఫీసు ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. చూసుకుందాం.. రమ్మని జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కూడా.. జగన్మోహన్ రెడ్డిపై నేరుగా సవాళ్లు విసిరారు. ఈ పరిణామాలన్నింటికీ ఇప్పుడు.. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు కనిపిస్తున్నాయని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
జేసీ బ్రదర్స్ ఆర్థికమూలాలను దెబ్బకొట్టే ప్రక్రియ ఏడాది కాలంగా సాగుతోందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆయన ట్రావెల్స్ బిజినెస్‌తో పాటు.. త్రిశూల్ సిమెంట్స్ అనే సంస్థకు ఇచ్చిన మైనింగ్నూ రద్దు చేశారు. ఒప్పందం ప్రకారం.. సంస్థను ఏర్పాటు చేయకపోవడం కారణంగా ఆ లీజుల రద్దు జరిగింది. కానీ… గుంటూరు జిల్లాలోని సరస్వతి సిమెంట్స్ ఫ్యాక్టరీ అసలు పునాదులు ప్రారంభించలేకపోయింది.. లీజులు ఇచ్చి పదేళ్లు దాటిపోయింది.. కానీ ఆ సంస్థకు.. శాశ్వత నీళ్లు… యాభై ఏళ్లకు లీజులు పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.