ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు భిన్నమైన వాదనలు మీడియాకు చెబుతూ వస్తున్నారు. రూ. 150 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం జరిగిందని ఓ సారి.. అవినీతి జరిగిందని మరోసారి చెబుతున్నారు. వైసీపీ నేతలు దోచేశారంటున్నారు. ఏసీబీ అధికారులు దుర్వినియోగం అంటున్నారు. అసలు దుర్వినియోగం జరిగిందా..? అవినీతి జరిగిందా..? అన్నదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ అంశంపైనే న్యాయనిపుణులు అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. కోర్టుల్లో ఎలాంటి చీవాట్లు అయినా పడనీ.. తాము అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయాలనుకున్నాం.. చేశాం.. తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా వ్యవహరించడానికే.. అర్థం పర్థం లేని వాదనలు వినిపిస్తున్నారన్న అనుమానాలు న్యాయనిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి.
అవినీతి ద్వారా ఎవరెవరు ఎంత పోగేసుకున్నారో ఏసీబీ రాబట్టిందా..?
ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగితే.. ఆధారాలను ఏసీబీ సిద్ధం చేసుకోవాలి. ఆ లావాదేవీలను పట్టుకోవాలి. తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఏం జరిగిందో.. ఏసీబీ పట్టుకుంది. అవినీతి లావాదేవీలను వెలికి తీసింది. కానీ.. అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ చేసిన ఏసీబీ ఇంత వరకూ.. ఎంత అక్రమ సొమ్ము…. అచ్చెన్నాయుడుకి చేరిందో… ఏ రూపంలో చేరిందో.. కనిపెట్టి ఉండాల్సింది. అయితే.. ఇంత వరకూ.. ఎవరికీ.. ఇలాంటి వ్యవహారాలపై నోటీసులు జారీ చేయలేదు. అక్రమ లావాదేవీలను గుర్తించినట్లుగా ప్రకటించలేదు. ఎక్కడా సోదాలు చేసినట్లుగా కానీ.. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నోటీసులు ఇచ్చినట్లుగా కానీ.. లేదు. మొత్తం.. అవినీతి అని చెప్పాలంటే.. ముందుగా… దాన్ని చేసిన వారు ఎలాంటి ప్రతిఫలం పొందారో చెప్పాలి. కానీ ఏసీబీ ఇక్కడ అలాంటి ప్రతిఫలాన్ని ఎవరు .. ఎలా పొందారో చెప్పడం లేదు.
నిధుల దుర్వినియోగం అనే వాదన ఎందుకు వినిపిస్తున్నారు..?
టెండర్లు పిలవకుండా.. నామినేషన్ల పద్దతి ద్వారా.. కాంట్రాక్టులు ఇచ్చి.. మందులు కొనుగోలు చేసి అత్యధిక రేట్లు చెల్లించి నిధులు దుర్వినియోగం చేశారని.. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే ఇలా చేశారనేది.. ఏసీబీ అధికారులు వినిపించిన మరో వాదన. నిధుల దుర్వినియోగం అనేది.. పూర్తిగా వేరే సబ్జెక్ట్. అవినీతి అని దానిని అనలేరు. ఈ విషయంలో ఏసీబీ చేయడానికి ఏమీ ఉండదని…న్యాయనిపుణులు చెబుతున్నారు. నిధుల దుర్వినియోగం అంశంలో చర్యలు తీసుకోవాలనే ఏసీబీకి ఉన్న అధికారాలు ఎక్కడా లేవని చెబుతున్నారు. అసలు నిధులు దుర్వినియోగం అంటే.. ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఎక్కడుందని అంటున్నారు. అంటే.. ఏసీబీ అధికారులు.. అటు అవినీతితో పాటు ఇటు నిధుల దుర్వినియోగం గురించి చెబుతున్నారు. కానీ రెండింటిటికి మధ్య పొంతన లేని వాదనలు వినిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
ఈఎస్ఐ కొనుగోళ్లకు కార్మిక మంత్రికి సంబంధమే ఉండదనేది అసలు నిజం..!
ఈఎస్ఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ. కార్మిక శాఖ మంత్రి ఆదేశాల మేరకు అక్కడ పని జరగదు. ఈఎస్ఐ డైరక్టర్లే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కామ్‌లో కూడా రాజకీయ నేతల జోక్యం బయటకు రాలేదు. మంత్రి సిఫార్సులు మాత్రమే చేయగలరు అని.. ఈఎస్ఐ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈ కేసులో.. అచ్చెన్న.. టెలీ హెల్త్ సర్వీసెస్‌ను ప్రారంభించమని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సేవలు అందిస్తున్న సంస్థల సేవలు వినియోగించుకోమని చెప్పారు. ఆ ఒక్క లేఖ ఆధారంగానే అచ్చెన్నాయుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఎలా తప్పు అవుతుందనేది.. చాలా మందికి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న.