కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల కిందట.. రూ. ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అందులో అప్పులు ఇస్తామనే ప్రకటనలే ఎక్కువ ఉన్నాయి. ఆ ఆప్పులు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నదానిపై.. ప్రభుత్వం నేరుగా చెప్పలేదు కానీ.., ప్రజల నుంచే.. అదీ పెట్రోల్, డీజీల్ ధరలను పెంచి పిండుకుంటామని.. పరోక్షంగా చెప్పింది. ఆ పిండుకోవడం ఇప్పుడు ప్రారంభమయింది. గత ఐదు రోజుల్లో పెట్రోల్ , డీజిల్ ధరను.. మూడున్నర నుంచి నాలుగు రూపాయల వరకు పెంచేశారు. ఈ పెంపు మున్ముందు కూడా ఉంటుందని.. లీటర్‌కు పది రూపాయల వరకూ పెంచేస్తారన్న ప్రచారం… ఢిల్లీలో జోరుగా సాగుతోంది. దానికి తగ్గట్లుగా నిధుల లభ్యత ప్రణాళికలు వేసుకున్నారని కూడా అంటున్నారు.
వైరస్ దెబ్బకు అంతర్జాతీయంగా లాక్ డౌన్ పడింది. వ్యాపార వ్యవహారాలు మందగించాయి. దీంతో క్రూడాయిల్ డిమాండ్ పడిపోయింది. ధర కూడా పడిపోయింది. అయినా కేంద్రం ఎలాంటి ధరలు తగ్గించలేదు. ఆ సమయంలో.. ఇండియాలోనూ లాక్ డౌన్ ఉండటంతో.. వినియోగం కూడా పెద్దగా లేదు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో.. పెట్రో రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తక్కువగానే ఉంది. కానీ.. కేంద్రం మాత్రం ప్రజల్ని బాదడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు.
ప్రస్తుతం.. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. రెండు నెలల తర్వాత మధ్య తరగతి జీవితాలు పూర్తిగా చిన్నాభిన్నం అయ్యాయి. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ అందరూ నష్టపోయారు. ఇప్పుడు రీస్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అయినా… కరోనా భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ప్రజలకు వీలైనంత సాయం చేసి.. వారి జీవితాలు మళ్లీ ట్రాక్‌లోకి పడేందుకు ప్రభుత్వాలు సహకరించాలి కానీ.. అసలే కొనుగోలు శక్తి తగ్గిపోయిన ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో మరింత పిండుకోవాలనుకోవడం.. ఏ ఆర్థికపరమైన సూత్రమే.. ఎవరికీ అర్థం కావడం లేదు.