ఈఎస్ఐ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఏసీబీ పేర్కొన్న రమేష్ కుమార్ అనే అధికారి భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భర్తకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. విచారణ చేయకుండా చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ.. ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందని.. తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలని.. రమేష్ కుమార్ భార్య స్మితారాణి పిటిషన్లో కోరారు. అసలు మొత్తం అరెస్టుల వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టులో న్యాయవాది పీవీ కృష్ణయ్య హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
నోటీస్ ఇవ్వకుండానే రమేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో కారణాలు చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అన్ని ఆధారాలు ఉన్నందున తాము నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే నిందితులను జ్యూడిషియల్ కస్టడీకి పంపామన్నారు. రెగ్యులర్ కోర్టులో తదుపరి వాదనలు వింటామన్న హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ. ఆ సంస్థ డైరక్టర్‌గా రమేష్‌కుమార్ పని చేసినప్పుడే.. అవకతవకలు జరిగాయని ఏసీబీ ఆరోపించింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా.. ఎవరినీ ప్రశ్నించకుండా… అనుమానితుల్ని విచారించకుండా.. అవినీతి జరిగితే.. ఆ సొమ్మంతా ఎటు పోయిందో గుర్తించకుడానే.. అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.