ఈటల రాజేందర్ పదవిని సీఎం కేసీఆర్ వారంలో పీకేయబోతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కరోనా వల్ల చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి మద్దతుగా దీక్షలు చేస్తున్న జర్నలిస్టుల వద్దకు వెళ్లిన రేవంత్.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైఫల్యం మొత్తాన్ని ఈటలపై నెట్టేసి.. ఆయనను పదవి నుంచి తప్పించబోతున్నారని రేవంత్ స్పష్టం చేశారు. తనకు ఈ విషయం.. టీఆర్ఎస్ మిత్రుడి ద్వారానే తెలిసిందన్నారు. మొదట్లో.. కేసీఆర్ .. కరోనా సహాయ చర్యలపై సుదీర్ఘ కాలంగా సమీక్షించారు. ఇప్పుడు ఈటల మాత్రమే ప్రెస్మీట్లు పెడుతున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి ఈటల రాజేందర్ వ్యవహారం.. కరోనా కేసుల కంటే ముందే టీఆర్ఎస్లో అలజడి రేపింది. ఆయనపై… టీఆర్ఎస్ అనుకూల పత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చాయి. బీసీ కాబట్టే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని కొన్ని పత్రికలు రాశాయి. ఆయనతో.. మాట్లాడేందుకు ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా.. జంకారు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించబోతున్నారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కరోనా విజృంభణ ప్రారంభమయింది. వైద్య శాఖ మంత్రిగా ఈటల అన్ని బాధ్యతలు చూసుకున్నారు. క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారు.
ఈ సమయంలో హఠాత్తుగా.. కరోనా కేసులు తగ్గకపోవడానికి ఆయనను బాధ్యుడిని చేస్తున్నట్లుగా రేవంత్ ప్రకటించి కలకలం రేపారు. రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్తో మైండ్ గేమ్ అడుతున్నారని ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఈటల విషయంలో.. గతం నుంచి ఉన్న ప్రచారాన్ని ఉపయోగించుకుని ఆయన ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏది నిజమో తెలాలంటే… రేవంత్ చెప్పిన వారం రోజులు ఆగాల్సిందే..!