వైసీపీ నేతలు… పోలీసులు.. ఏసీబీ పోలీసులు ఏం చేయబోతున్నారో.. ఎవరెవర్ని అరెస్ట్ చేయబోతున్నారో.. ఎలాంటి కేసులు పెట్టబోతున్నారో కూడా ముందుగానే ప్రకటిస్తున్నారు. ఏసీబీ అధికారులంటే.. వైసీపీ నేతలే చాలా చురుకుగా ఉన్నారు. అచ్చెన్నాయుడు తర్వాత రోజుకొకరు చొప్పున టీడీపీ నేతలు అరెస్ట్ అవుతారని.. వైసీపీ నేతలు చెబుతూ.. వస్తున్నారు. ఈ క్రమంలో.. రెండో రోజు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎవరు అరెస్టవుతారో.. అని సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. అయితే.. స్పీకర్ తమ్మినేని సీతారం.. అచ్చెన్నాయుడుపై తర్వాత పెట్టబోయే కేసుల వివరాలను కూడా వెల్లడించారు. అచ్చెన్నాయుడు.. మనీ లాండరింగ్.. మనీ లేయింగ్ కేసులు పెట్టబోతున్నారని ఆయన మీడియాతో చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల గురించి చెప్పడానికి పెట్టిన మీడియా సమావేశంలో ఆయన అచ్చెన్నాయుడు కేసు గురించి ఇతర వైసీపీ నేతల్లాగానే స్పందించారు. అరెస్ట్ చేయగానే.. ఏసీబీ పోలీసులు తనకు సమాచారం ఇచ్చారని… అవినీతి చేసిన వాళ్లను అరెస్ట్ చేయవద్దా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు.. స్పీకర్‌కు మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ్మినేని ఏకపక్షంగా అధికారపార్టీ వైపు ఉన్న సమయంలో.. అచ్చెన్నాయుడు… పలుమార్లు.. ఆ సీట్లో కూర్చుని అలా మాట్లాడకూడదని.. అధికారపక్షం వైపు వచ్చి మాట్లాడాలని సూచించేవారు. అలాంటి సందర్భంలో ఓ సారి.. “నేను మంత్రినవుతా.. నీ సంగతి చూస్తా..” అని తమ్మినేని… అచ్చెన్నాయుడుపై స్పీకర్ చైర్లో నుంచే విరుచుకుపడ్డారు. ఆయన మంత్రి కాక ముందే.. అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.
అవినీతి జరిగిందని నిరూపించాలంటే.. ముందుగా.. సదరు అరెస్టయిన వ్యక్తి లంచం తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించాలి. టెలీ హెల్త్ సర్వీసెస్ కు లబ్ది కలిగించేలా అచ్చెన్నాయుడు లేఖ రాశారని ఏసీబీ చెబుతోంది కాబట్టి..ఆ సంస్థ నుంచి అచ్చెన్నాయుడుకు లేదా.. ఆయన కుటుంబానికి చెందిన వారికి లేదా.. బినామీ కంపెనీలు అని ఆరోపించే వారికైనా… ఆ సంస్థ నుంచి ప్రయోజనం కలిగి ఉండాలి. లేకపోతే.. ఏసీబీ అధికారులకు చిక్కులు ఏర్పడతాయి. ఈ క్రమంలో అచ్చెన్నపై.. మనీలాండరింగ్.. మనీ లేయింగ్ కేసులు పెడతామని స్పీకర్ ప్రకటించడం… ఆసక్తి రేకెత్తిస్తోంది.