ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అరెస్టు ల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి లను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని టిడిపి నేతలు అంటుంటే, తమ హయాంలో అవినీతి జరిపించినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ క్రమంలో మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయి అన్నదానిపై ప్రజల్లో కూడా ఆసక్తి ఉంది.
జనసేన అధికారిక ప్రకటన తటస్థంగా అటు టిడిపి పక్షాన కానీ వైఎస్సార్సీపీ పక్షాన కానీ తీసుకోకుండా ఉంటే, కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం టిడిపి నేతల అరెస్టు ని ఖండించారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అరెస్టులను స్వాగతిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే కొందరు బిజెపి నాయకులు మాత్రం వివిధ ఛానల్స్ లో డిబేట్స్ లో పాల్గొన్నప్పుడు అరెస్టు ను ఖండిస్తూ టీడీపీ అనుకూల వైఖరిని తీసుకోవడం ఆ పార్టీ అధినాయకత్వానికి నచ్చకపోవడంతో వారిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.
బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా చర్చల్లో మాట్లాడుతున్నారని బీజేపీ నేత లక్ష్మీపతి రాజా పై సస్పెన్షన్ వేటు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా అచ్చెనాయుడుకి మద్దతుగా మాట్లాడటంపై కిలారు దిలీప్ కి నోటీసులు జారీ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీ క్రమ శిక్షణ సంఘం కో కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం పేరిిిిట ఈ నోటీసు లు జారీ అయినట్లు సమాచారం. దీంతోపాటు టీడీపీ అనుకూల వైఖరి ప్రదర్శించిన బిజెపి నేత చిన్నం రామకోటయ్య పై కూడా మీడియాతో మాట్లాడే విషయంలో ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా తమ పార్టీలో ఉంటూ తమ పార్టీ అధినాయకత్వం తీసుకున్న స్టాండ్ కు భిన్నంగా మాట్లాడిన నేతలపై బిజెపి ఇంత వేగంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పూర్తిగా టిడిపి వ్యతిరేక వైఖరి అవలంబించడం ఆ పార్టీ అభిమానులకు మింగుడు పడక పోవడమే కాకుండా పార్టీ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది.