ఈఎస్ఐ స్కామ్ జరిగిందంటూ..ఫిబ్రవరిలో విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. అందులో అచ్చెన్నాయుడు పేరు లేదు. కానీ ఆయన లేఖ రాశారంటూ.. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు.. కాంట్రాక్ట్ ఇచ్చారని.. ఆయనను ఆఘమేఘాలపై పోలీసులు… ఇల్లు గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారు. ఈ మధ్యలో అసలు ఎప్పుడు కేసు పెట్టారు..? ఎప్పుడు ఏసీబీని దర్యాప్తు చేయాలని ఆదేశించారు..? ఇలాంటివి ఏమీ ఎవరికీ తెలియదు. బయటకు రాలేదు. కానీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రక్రియ మొత్తం ఎలాగైనా బయటకు రావాల్సిందే. ఇప్పుడు… ఆ వివరాలను టీడీపీ నేతలు సంపాదించి మీడియాకు విడుదల చేశారు.. దాని ప్రకారం.. అచ్చెన్నాయుడుపై ఏసీపీ కేసు పెట్టింది.. పదో తేదీన. గత నెలలోనో.. అంతకు ముందు నెలలోనే కాదు.. ఈ నెల పదో తేదీన కేసు నమోదు చేశారు. పన్నెండో తేదీన ఉదయం అరెస్ట్ చేశారు. అంటే.. మధ్యలో ఒక్క రోజే ఉంది. ఈ ఒక్క రోజులోనే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారన్నమాట. ఇదే విషయాన్ని టీడీపీ నేత పట్టాభి మీడియాకు వెల్లడించారు. ఒకేరోజులో విచారణ ఎలా పూర్తిచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక్క రోజు విచారణలో అంత అచ్చెన్నతో పాటు పలువుర్ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు. నిజంగా నిధుల దుర్వినియోగం అవినీతి జరిగి ఉంటే.. అది ఒక్కరిద్దరితో అయ్యే పని కాదు. జీవోలు జారీ చేసిన ఉన్నత అధికారి.. ప్రిన్సిపల్ సెక్రటరీ వరకూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాకపోతే.. కోర్టులో అయినా.. వారికీ భాగముందని బయట పడక తప్పదు. హడావుడిగా నమోదైన ఈ కేసులో.. అరెస్టుల వ్యవహారం అధికారుల్లోనూ కలకలం రేపింది. అప్పట్లో ఉన్న ఉన్నతాధికారులు టెన్షన్‌కు గురయ్యారు. అయితే..వారిని సంతృప్తి పరచడానికో.. మరో కారణమో కానీ.. ఏసీబీ అధికారులు.. మీడియాకు ఓ లీక్ పంపించారు. దాని ప్రకారం… ఈఎస్ఐ స్కాంలో జీవోలు ఉన్నతాధికారులకు తెలియకుండానే వచ్చాయనేది ఆ సారాంశం. సంబంధిత శాఖ ఉన్నతాధికారుల వద్దకు నోట్ ఫైల్ పంపకుండా ..ప్రక్రియ ముందుకు వెళ్లటంలో కింది స్థాయి ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని అనుమానం ఉందంటూ లీక్ పంపించారు. శాఖాపరమైన జీవోలను ఉన్నతాధికారులు పరిశీలించలేదని చెప్పుకొస్తున్నారు. విచారించి ఆధారాలు సేకరించాక కేసులు పెడతామని సమాచారం బయటకు పంపారు. ఏసీబీ అధికారుల నుంచి వచ్చిన ఈ సమాచారం… మీడియా ప్రతినిధుల్ని ఆశ్చర్య పరుస్తోంది.
అసలు జీవోలను పరిశీలించకుండా.. అవినీతి జరిగిందని కేసులు ఎలా పెట్టారోననే కాదు … ఆ జీవోలు సంబంధిత ఉన్నతాధికారులకు తెలియకుండా వచ్చాయనే అనుమానాల్ని కూడా ఏసీబీనే వ్యక్తం చేయడమే వింతగా ఉందని అంటున్నారు. ఒక వేళ తమకు తెలియకుండా.. తమ పేర్ల మీద జీవోలు వస్తే.. ఆ ఉన్నతాధికారులకు తర్వాత కూడా తెలియకుండా ఉంటుందా..? ఈ చిన్న లాజిక్‌ను ఏసీబీ అధికారులు ఎందుకు మిస్సవుతున్నారన్న చర్చ మీడియా వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఈఎస్ఐ స్కాం వ్యవహారం కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.