వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయి దాదాపు ఏడాది కాలం కావస్తోంది. వచ్చిన మొదటి కొద్ది నెలలపాటు అమ్మఒడి, వృద్ధాప్య పింఛను వంటి సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసిన జగన్, ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీను మటాష్ చేయడం మీద ఫోకస్ చేసినట్లుగా ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ క్రమంలో లో టిడిపి కి చెందిన ఒక మాజీ మంత్రి ని టార్గెట్ చేస్తూ జగన్ తెచ్చిన జిఓ తో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రైవేట్ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అన్న చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే..
టిడిపికి చెందిన మాజీమంత్రి టార్గెట్ గా కొద్ది నెలలుగా పని చేస్తున్న జగన్ టీం:
టిడిపికి చెందిన ఆ మాజీ మంత్రి ప్రధాన వ్యాపారం విద్యాసంస్థలే. తెలుగుదేశం పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఫండింగ్ విషయంలో బ్యాక్ బోన్ గా ఈయన నిలిచాడని, అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి సంపాదించుకున్నారని పార్టీలో సైతం కీలక పాత్ర, ప్రాధాన్యత ఆయనకు దక్కిందని విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ఉద్దేశంతో పలువురు మాజీ మంత్రుల మీద కొన్ని స్పెషల్ టీమ్స్ కొద్ది నెలలుగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే విద్యాసంస్థల అధినేత కి సంబంధించిన మొత్తం ఫైల్స్ అన్నీ నెలల తరబడి పరిశీలించి కూడా ఆ టీం, ఏ లూప్ హోల్ పట్టుకోలేక పోయినట్లుగా తెలుస్తోంది. బహుశా ప్రతిపక్షంలో కి వచ్చిన తర్వాత అధికార పక్షాలు టార్గెట్ చేస్తాయన్న ఉద్దేశంతో ఆ మాజీ మంత్రి ముందే జాగ్రత్త పడి ఉండవచ్చు.
మొత్తం విద్యా సంస్థలకు వర్తించేలా జీవో తెచ్చిన జగన్ ప్రభుత్వం:
అయితే లూప్ హోల్స్ పట్టుకోవడంలో తమ టీం సక్సెస్ కాకపోవడంతో, ప్రభుత్వం మొత్తం విద్యా సంస్థలను ప్రక్షాళన చేసే విధంగా కొత్త జీవో తీసుకువచ్చింది. మే నెలలో విడుదల అయిన ఈ జీవో ప్రకారం, ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా గరిష్టంగా 360 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలి. గతంలో 2 వేల చదరపు అడుగుల వైశాల్యాని కి ఒక సెక్షన్ కి అనుమతి ఉండేది. అయితే మాజీ మంత్రి గారి కాలేజీ లలో ఒక్కొక్క కాలేజీ లో కొన్ని వందల మంది, కొన్ని చోట్ల వేలమంది కూడా చదువుతూ ఉండేవారు. చదరపు అడుగుల నిబంధనలను పాటించగలిగే స్తోమత ఉండడంవల్ల విస్తీర్ణమైన స్థలంలో కాలేజీలు స్థాపించి, వందలాది మంది విద్యార్థులు చేర్చుకుని కాలేజీ నడిపేవారు. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధన వల్ల, కాలేజీ విస్తీర్ణం ఎంత ఉన్నప్పటికీ గరిష్టంగా కేవలం 360 మంది విద్యార్థులను మాత్రమే ఒక కాలేజీలో చేర్చుకోగలుగుతారు. ఇంకా ఎక్కువ మంది చేర్చుకోవాలనుకుఃటే మరొక కాలేజీ కోసం అనుమతి పెట్టుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కొత్త జీవో వల్ల సదరు మాజీ మంత్రి గారి వ్యాపారం మూతపడే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ఒక ఎలుకను చంపడానికి ఇల్లు మొత్తం తగలపెట్టినట్లు ఉందటున్న బడ్జెట్ కాలేజీలు :
అయితే ఈ నిబంధన కారణంగా కేవలం మాజీ మంత్రి గారి విద్యాసంస్థలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు విద్యాసంస్థలు మొత్తం మటాష్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ ల నాణ్యత అంతంత మాత్రంగా ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కాలేజీలంత ఫీజు వసూలు చేయక పోయినప్పటికీ వాటికి దీటుగా చదువు చెప్తున్న చాలా కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నాణ్యమైన విద్య అందించే మీడియం బడ్జెట్ కాలేజీలలో స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉంటుంది. ఆ కారణంగా వారు మరింత మంచి లెక్చరర్లను నియమించుకోవడం, మంచి ఫలితాలను సాధించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇటువంటి కాలేజీలన్నీ మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీ ల ఫీజు లో సగం లేదా అంతకంటే తక్కువ మాత్రమే వసూలు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న అనేక కాలేజీలు, కొత్తగా వచ్చిన నిబంధన కారణంగా ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోలేక పోవడం తో, ఖచ్చితంగా ఫీజులు పెంచి తీరవలసిన పరిస్థితిలో పడిపోతారు. ఇది ఆ కాలేజీ ల మనుగడ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం ప్రైవేటు విద్యా వ్యవస్థ విలవిల:
19 91లో ఆర్థిక సరళీకరణ విధానాలు తీసుకు వచ్చిన తర్వాత భారత దేశంలో ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగం చేయి చేయి కలిపి నడుస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు పరిశ్రమల స్థాపనకు, ఇతర ప్రైవేటు వ్యాపారాలకు భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రభుత్వాలు ప్రైవేటు విద్యా సంస్థల పై మాత్రం కొరడా ఝళిపిస్తూ ఉన్నాయని, మీడియం బడ్జెట్ కాలేజీల వల్ల అనేకమంది లెక్చరర్లకు సిబ్బందికి ఉపాధి లభిస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, ఇటువంటి మీడియం బడ్జెట్ ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారని, కానీ ప్రస్తుతం జగన్ తీసుకొచ్చిన జీవో కారణంగా అటువంటి ప్రైవేటు విద్యాసంస్థలు చాలా వరకు మూత పడే అవకాశం కనిపిస్తోందని మీడియం బడ్జెట్ కాలేజీల యజమానులు అంటున్నారు. పైగా కొత్త కాలేజీలను అనుమతించకుండా, ప్రభుత్వ కళాశాలల సంఖ్య పెంచకుండా, ఉన్న కాలేజీలలో విద్యార్థుల సంఖ్య పై నిబంధనలు పెడితే సీట్లు దొరకని మిగతా విద్యార్థులంతా ఎక్కడికి పోతారు అని వారు ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద:
ప్రముఖ మీడియా సంస్థలు పట్టించుకోకుండా వదిలివేసిన ఈ సమస్యపై మొన్నీ మధ్య ఒక ఛానల్ డిబేట్ పెడితే, అందులో పాల్గొనడానికి చాలామంది మీడియం బడ్జెట్ కాలేజీల యజమానులు భయపడ్డారు. మీడియా ముఖంగా తమ వాదన వినిపిస్తే ఎక్కడ ప్రభుత్వం తమను వేధిస్తుందో అన్న అభిప్రాయం తో చాలామంది కాలేజీ యజమానులు బయటికి రాకపోయినప్పటికీ, కొంతమంది ధైర్యంగా తమ వాదన వినిపించారు. ఏది ఏమైనా జగన్ ఈ నిర్ణయం పై పునరాలోచించుకోవాలని ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు కోరుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయడం కోసం తన పొట్ట కొట్ట వద్దని వారు కోరుతున్నారు. మరి జగన్ వీరి విజ్ఞప్తులు వింటాడా అన్నది వేచి చూడాలి.