ఛానళ్లూ, పేపర్లూ, వెబ్ సైట్లూ… వేటిపైనా తనకు నమ్మకం లేదని కుండ బద్దలు కొట్టేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఈమధ్య ఆయనకు ఖోపాలు బాగా వస్తున్నాయి. అలా వస్తే.. ఏదీ మనసులో పెట్టుకోవడం లేదు. వెంటనే కక్కేస్తున్నారు. అందుకోసం తనకోసం ఓ ఛానల్ పెట్టుకున్నారు కూడా. ”ప్రతీ పార్టీకీ అండగా ఓ మీడియా ఉంది. ఆ పార్టీని తిడితే వాళ్లకు కోపాలు వస్తున్నాయి. విమర్శిస్తూ వార్తలు రాసేస్తున్నారు. ఓ పార్టీని పొగిడినా అంతే. వాళ్లకు అనుకూల మీడియా మనల్ని మెచ్చుకుంటూ వార్తలు రాస్తుంటారు. ఇవన్నీ చూసి, మీడియాపై నమ్మకం పోతోంది” అంటూ తన అసహనం వ్యక్తం చేశారు.
నాగబాబు చెప్పింది నిజమే. టీడీపీ, వైకాపా, తెరాస… ఇలా ప్రతీ పార్టీకి ఓ ఛానలో, పేపరో ఉంది. జనసేనకే లేదు. అయితే ప్రస్తుతం పవన్ ఆ ప్రయత్నాల్లో ఉన్నాడని టాక్. పవన్ ఓ దిన పత్రికని ప్రారంభించే అవకాశాలున్నాయని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కివస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాగబాబు కూడా చూచాయిగా చెప్పేశారు. ”ఓ పేపర్ పెట్టే ఆలోచనలు ఉన్నాయి. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి” అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపడిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పవన్కీ, జనసేనకీ ఓ టీవీ ఛానల్ బాగా సపోర్ట్ చేస్తోంది. ఆ ఛానల్ రేటింగులు చాలా తక్కువగా ఉన్నాయి. ముందు ఆ ఛానల్ ని గాడిలో పెట్టాలని పవన్ భావిస్తున్నట్టు టాక్.