పదహారో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిచాలని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది. సంప్రదాయంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంది. అయితే.. గవర్నర్ మాత్రం.. ఈ సారి కొత్త పంధాలో తన విధి నిర్వహించబోతున్నారు. కరోనా కారణంగా ఆయన రాజ్‌భవన్‌లోనే ఉండబోతున్నారు. అక్కడి నుంచి ఆన్ లైన్ ద్వారా.. ప్రసంగిస్తారు. ఇక్కడ అసెంబ్లీలో శాసనమండలిలో ఎవరి సీట్లలో వారు కూర్చుని సభ్యులు గవర్నర్ ప్రసంగం వింటారు. ఉభయ సభల్లో విడివిడిగా గవర్నర్ ప్రసంగం ప్రసారం చేస్తారు. మూడు రోజులే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు స్పీకర్.
60 ఏళ్లు దాటిన వారు రావడం రాకపోవడం వారిష్టమని.. రావొద్దని చెప్పలేమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే స్పీకర్‌కు కూడా అరవై ఏళ్లు దాటడం కొసమెరుపు. కరోనా కారణంగా బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఇంత వరకూ నిర్వహించలేదు. మొదట్లో.. స్థానిక ఎన్నికల కోసం వాయిదా వేశారు. తర్వాత కరోనా అడ్డం వచ్చింది. అది ఇంకా తగ్గలేదు. కానీ బడ్జెట్ ఆమోదం పొందాల్సిన పరిస్థితి. నాలుగు నెలలకు సరిపడా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకుని బండి నడిపించారు. ఇప్పుడు… మిగతా కాలని ఆమోద ముద్ర వేయించుకోక తప్పని పరిస్థితి.
అందుకే తప్పని పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలనుకున్నా.. పదహారోతేదీ ఉదయమే నిర్వహించి… బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసి.. అదే రోజు ఉభయసభల్లో ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.