మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ త్వరలోనే వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా అని అడిగితే అవునంటూ రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలను నెలకొల్పడం తో పాటు దశాబ్ద కాలానికి పైగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు నారాయణ. పార్టీ దశాబ్దకాలంపాటు ప్రతిపక్షంగా ఉన్న సమయంలో నారాయణ వంటి వారు పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలిగించారు. బహుశా ఈ కారణం చేతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖలు అప్పగించడం తోపాటు పార్టీలో బాగా ప్రాధాన్యత ఇచ్చారు. నారాయణ కూడా నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులను రికార్డ్ సమయంలో పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వీచిన వ్యతిరేక పవనాల లో నారాయణ సైతం కొట్టుకుపోయారు.
దీంతోపాటు తాజాగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను వారి వ్యాపారాలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ల అరెస్ట్ వంటి సంఘటనలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా విద్యాసంస్థలు కలిగి ఉన్న నారాయణ వ్యాపారాలను కూడా ఇదే విధంగా టార్గెట్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిడుల తో పాటు, నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు దృష్ట్యా రాజకీయ భవిష్యత్తు కోసం వైయస్ఆర్సిపి గూటికి నారాయణ త్వరలోనే చేరే అవకాశం ఉన్నట్లు గా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జగన్ కు సన్నిహితుడైన నెల్లూరు జిల్లా నేత ఒకరు నారాయణ తో మంతనాలు కూడా ఇదివరకే సాగించారని రూమర్లు వినిపిస్తున్నాయి.
మొత్తానికి నారాయణ, ఈ గుసగుసల కి అనుగుణంగానే వైఎస్ఆర్సిపిలో చేరతాడా లేక టిడిపి లోనే కొనసాగుతారా అనేది వేచి చూడాలి.