ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఈఎస్ఐ స్కాం విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా అచ్చెన్నాయుడుపై కేసు పెట్టి.. ఆధారాలు ఉన్నందున అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఆ ఆధారాలేమిటంటే.. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు..సేవలను ఉపయోగించుకోవాలని ఆయన రాసిన లేఖ. దీని ద్వారా.. రూ. మూడు కోట్లు నష్టపోయారంటూ.. విజిలెన్స్ నివేదికలో ఉంది. దీంతో 900 కోట్ల రూపాయల స్కామ్ అని.. 150 కోట్ల దుర్వినియోగం అని జరుగుతూ వచ్చిన ప్రచారం.. చివరికి అచ్చెన్నాయుడుకు సంబంధం ఉన్నది రూ. మూడు కోట్ల వద్దకు చేరింది. అయితే.. టీడీపీ హయాంలో.. ఆ కంపెనీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని.. కొత్తగా టీడీపీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుత ప్రభుత్వమే.. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు మూడు కోట్ల రూపాయలు చెల్లించిందని.. . ప్రస్తుత కార్మిక శాఖ మంత్రిని అరెస్ట్ చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ సర్కార్ వచ్చిన తర్వాత ఈఎస్ఐ స్కాంపై విచారణ ప్రారంభించారు. విచారణ జరుగుతున్న సమయంలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీకి ఎలా చెల్లింపులు చేశారన్నది ఇప్పుడు టీడీపీ నేతలు లేవెనెత్తుతున్న ప్రశ్న. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి చెల్లింపులు చేయలేదని.. టీడీపీ నేతలు ప్రత్యేకంగా నొక్కి చెబుతున్నారు.
ఇప్పటికే.. ఈఎస్ఐ స్కాంలో పదో తేదీన రాత్రి కేసు నమోదు చేసుకుని పన్నెండో తేదీన ఉదయం అరెస్ట్ చేయడం.. ఈ మధ్యలో ఏసీబీ అధికారులు ఎప్పుడు విచారణ జరిపారో.. చెప్పాలని.. టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కుట్ర కోణం ఉందని…. ఈ వ్యవహారాలన్నింటినీ తాము కోర్టు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. ముందు ముందు ఈ స్కాం విషయంలో ఇంకెన్ని విచిత్రాలు జరుగుతాయో.. ఎన్నెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే..!