వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కొద్ది కాలం నుంచి ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వైసీపీ బ్యాన్ చేసిన టీవీ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నారు. అయితే.. ఆయనపై వైసీపీ అనుకూల మీడియా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు కానీ.. ఒక్కరంటే.. ఒక్క నేత కూడా బహిరంగంగా స్పందించంలేదు. అలా స్పందిస్తే.. ఆయన మరింత ఎటాకింగ్‌కు వెళ్తారని.. అది మంచిది కాదన్న వ్యూహంలో వైసీపీ ఉందేమో అని అనుకున్నారు. అయితే.. ఇప్పుడు వ్యూహం మార్చారేమో కానీ.. వైసీపీకే చెందిన రఘురామకృష్ణంరాజు సామాజికవర్గానికే చెందిన ఎమ్మెల్యేతో ఎదురుదాడి ప్రారంభించారు. నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు… రఘురామకృష్ణంరాజుపై విమర్శలు చేస్తూ మీడియా ముందుకు వచ్చారు.
జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందన్న ఎంపీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మండిపడ్డారు. జగన్ అందర్నీ కలుస్తున్నారని.. తాను కూడా కలిశానని చెప్పుకొచ్చారు. జగన్‌ను బతిమాలి టిక్కెట్ తెచ్చుకుని ఆయన చూపు చూస్తేనే గెలిచి ఎంపీ అయ్యారని మండిపడ్డారు. రఘురామరాజు.. ఏబీఎన్, టీవీ5 లాంటి చానళ్లతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలన్నింటికీ ప్రసాదరాజు కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి చాన్స్ వస్తే.. రఘురామకృష్ణంరాజు ఎందుకు ఊరుకుంటారు. వెంటనే.. ఓ పదిహేను నిమిషాల వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రసాదరాజును తక్కువగానే విమర్శించారు. అంత కంటే ఎక్కువగా సూటిగా కాకుండా పరోక్షంగా వైసీపీ హైకమాండ్‌ను విమర్శించారు.
ముదునూరి ప్రసాదరాజుతో తనపై విమర్శలు ఎవరు చేయించారో తెలుసునని… తనను అలా తిట్టినందుకు ప్రసాదరాజుకు.. త్వరలో మంత్రి పదవి వస్తుందన్నారు. అలా రావాలని తాను కోరుకుంటున్నానని కూడా చెప్పారు. అయితే.. తాను బతిమాలి పార్టీలోకి వచ్చానో.. తనను బతిమాలి పార్టీలోకి తీసుకున్నారో.. తనకు టిక్కెట్ ఇచ్చినవారికి తెలుసంటూ సెటైర్లు వేశారు. అలాగే… ప్రసాదరాజు తాను జగన్‌ను కలిశానని.. అందరూ జగన్‌ను కలుస్తున్నారని చెప్పారు. అయితే.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు.. పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసి.. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో కలిశారు. దాన్నే ఎత్తి చూపిన రఘురామకృష్ణంరాజు.. ప్రజల వద్ద నుంచి తాను డబ్బులు వసూలు చేయనని స్పష్టం చేశారు. అటువంటి సొమ్ముతో తాను ఫోటోలు దిగలేనన్నారు. జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడటానికి టైమ్ అడిగితే ఇవ్వలేదని.. స్పష్టం చేశారు.
మొత్తానికి రఘురామకృష్ణంరాజు… అసంతృప్తిని వైసీపీ చల్లార్చే ప్రయత్నం చేయడం లేదు. ఆయనపై ఎదురుదాడికే ప్రాధాన్యం ఇస్తోంది. అంటే.. ముందు ముందు రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కలకలం రేపడం ఖాయంగానే కనిపిస్తోంది.