‘సోగ్గాడే చిన్ని నాయన’… నాగార్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ సినిమా ఇది. కల్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన పనితనానికి నాగ్ ఖుష్ అయి, నాగ చైతన్యని సైతం తన చేతుల్లో పెట్టాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా అంచనాలకు తగ్గట్టుగానే తీయగలిగాడు కల్యాణ్. అంతకు ముందు నుంచీ.. ‘సోగ్గాడే..’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ వస్తుందని ప్రచారం సాగింది. అందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా కల్యాణ్ రెడీ చేసి పెట్టాడు. నాగ్ పలుమార్లు మార్పులు చేర్పులూ సూచించడం, దానికి కల్యాణ్ రిపేర్లు చేయడం.. ఇదీ ఏళ్ల తరబడి సాగుతున్న తంతు. ఈలోగా నాగ్ మూడు నాలుగు సినిమాలు చేసేశాడు కూడా. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు కథకి ఓకే చెప్పాడు. దాంతో… కల్యాణ్ ఆశలన్నీ ఆవిరయ్యాయి.
బంగార్రాజు చేస్తానని చెప్పడు, అలాగని చేయను అని కూడా చెప్పకపోవడంతో కల్యాణ్ డైలామాలో పడ్డాడు. అయితే.. కల్యాణ్ తీసిన ‘నేల టికెట్ట్’ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో నాగ్ ‘బంగార్రాజు’ సినిమా చేయడానికి భయపడుతున్నాడని టాక్. నాగ్ కోసం ఆగాలా? లేదంటే మరో కథ రెడీ చేసుకుని, ఇంకో సినిమా చేసుకోవాలా? అనేది కల్యాణ్‌కీ అర్థం కావడం లేదు. అయితే తాజా పరిణామాల్ని చూస్తే బంగార్రాజు చేయడానికి నాగ్ ఆసక్తి చూపించడం లేదనే అనిపిస్తోంది. ఎన్ని సార్లు మార్పులు చేసుకుని వచ్చినా, నాగ్ని మెప్పించలేకపోతున్నాడట కల్యాణ్. దాంతో.. ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేశాడని సమాచారం. ఇప్పుడు కల్యాణ్ మరో హీరోని వెదుక్కోవాల్సిందే.