జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని.. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయని.. పనులు లేకుండా పోయాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కానీ… ఏపీ అభివృద్ధి పథంలో సాగుతోందని.. ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రభుత్వ పన్నుల ఆదాయం దాదాపుగా పది వేల కోట్ల రూపాయలకు పడిపోయినా కూడా.. జీఎస్డీపీ 12.73 శాతం పెరిగింది. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన ఆర్థిక సర్వే ప్రకారం… 2019-20లో జీఎస్డీపీ రూ.9,72,782 కోట్లుగా నమోదైంది. తెలుగుదేశం పార్టీ హయాంలో అంతకు ముందు ఏడాది 2018-19లో దీని విలువ రూ.8,62,957 కోట్లు మాత్రమే. అంటే జగన్ పాలన చేపట్టిన ఏడాదిలో ఏపీ జీఎస్డీపీ రూ.1.10 లక్షల కోట్లు పెరిగిందన్నమాట.
ఏడాదిలో ప్రజల ఆదాయం కూడా బాగా పెరిగింది. 2019-20 కాలానికి ఏపీ తలసరి ఆదాయం రూ.1,69,519. అంటే.. సగటున.. ఏపీలో ఒక్కో వ్యక్తి రూ. లక్షా డెభ్బై వేల వరకూ సంపాదించారన్నమాట. చంద్రబాబు హయాంలో… ఇది.. రూ.1,51,173 మాత్రమే ఉన్నట్లుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,432 మాత్రమే. అంటే.. ఏపీ దేశ సగటు కన్నా ఎక్కువ ఆదాయంతో ఉందన్నమాట. ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో… గత ఏడాది కాలంలో తాము ఏమేం చేశామో.. ఎలా నిధులు ఆదా చేశామో.. ఎలా.. అభివృద్ధి చేశామో వివరించారు.
వాస్తవానికి ఏడాది కాలంలో ఏపీలో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇసుక కొరత, ప్రభుత్వం అభివృద్ధి పనులు నిలిపివేయడం … కరోనా సహా వివిధ కారణాల వల్ల ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందన్న అంచనాలు వచ్చాయి. దీని వల్ల.. ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయిందని చెప్పుకున్నారు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వ పన్నుల ఆదాయం దాదాపుగా పదివేల కోట్లు తగ్గింది. అయితే.. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సరే.. ప్రజలకు మాత్రం.. తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం లెక్కలు విడుదల చేసింది. మొత్తంగా చూస్తే.. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ప్రగతి పథంలో ముందుకెళ్తున్నట్లుగానే చూడాలి..!