స్టార్ హీరోలెవరూ.. చిత్రీకరణలకు సిద్దంగా లేరని తేలిపోయింది. మహేష్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రవితేజ… వీళ్ల సినిమాలేవీ ఇంత వరకూ పట్టాలెక్కలేదు. వీళ్లంతా షూటింగులకు సన్నద్ధం అవ్వడానికి మరి కొంత కాలం పడుతుంది. కరోనా భయాలు తగ్గడమో, లేదంటే… కరోనాతో పోరాడక తప్పదని అర్థమయ్యాకో గానీ… వీళ్లెవరూ సెట్స్‌కి వచ్చేట్టు కనిపించడం లేదు. స్టార్ హీరోలు కదా.. వాళ్ల మాటని దర్శకులు, నిర్మాతలూ పాటించాల్సిందే. హీరోలే కాదు, హీరోయిన్లూ షూటింగులంటే భయపడుతున్నారు. కీర్తి సురేష్ కూడా అంతే. `ఇప్పట్లో షూటింగు కష్టమే` అని తేల్చేసింది. కరోనా భయం వల్ల షూటింగులకు దూరమయ్యే పరిస్థితులు వచ్చాయని, కనీసం రెండు మూడు నెలల వరకూ బయటకు రాకుండా ఉండడమే ఉత్తమమని తేల్చేసింది.
”బయట పరిస్థితులు బాగాలేవు. ఇలాంటి సమయంలో షూటింగులంటూ రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మనం జాగ్రత్తగా ఉన్నా, చుట్టు పక్కలవాళ్లంతా అదే జాగ్రత్తలు పాటించాలి కదా?” అంటోంది. కీర్తి అనే కాదు, చాలామంది స్టార్ హీరోయిన్లు ఇదే మాట చెబుతున్నారు. అందం, ఆరోగ్యం… ఇవి రెండూ కాపాడుకోవడం కథానాయికల ప్రధమ కర్తవ్యం. పైగా వాళ్లంతా చాలా సున్నితంగా ఉంటారు. హీరోలే బయటకు రానప్పుడు, మనమెందుకు తొందరపడాలి? అని ప్రశ్నించుకుంటున్నారేమో..? ‘నో’ అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇలా హీరోలు, హీరోయిన్లూ ఇంటి పట్టునే ఉంటే.. షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో..?