ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా పండగ ఆస్కార్. ఆ ప్రతిమ ముద్దాడాలని కలలు కనని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండరేమో. అవార్డు రాకపోయినా.. ఆ వేడుక చూడడమే ఓ ఆనందం. ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకోగల ఆకర్షణ ఆస్కార్ వేడుకలకు ఉంది. అయితే.. ఇప్పుడు ఈ ఆస్కార్కీ కరోనా సెగ తగిలింది. ప్రతీ యేడాది ఫిబ్రవరిలో ఆస్కార్ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. 2021 ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలు నిర్వహించాల్సివుంది. అయితే కరోనా కారణంతో.. ఈ పురస్కారాల ప్రదానోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు అవార్డు కమిటీ ప్రకటించింది. పరిస్థితులు చక్కబడితే ఏప్రిల్ 25న ఈ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడే చిత్రాల అర్హత తేదీని సైతం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కిక్కిరిసిన స్టేడియంలో ఆస్కార్ వేడుకల్ని నిర్వహిస్తుంటారు. అదే అందం.. కూడా. కరోనా భయాలు వెంటాడుతున్న ఈసమయంలో.. ఈ తరహా వేడుకలు నిర్వహించడం అసాధ్యం. ప్రమాదకరం. అందుకే అవార్డు కమిటీ ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది.